AP Politics: ఏపీలో దిగజారుతున్న రాజకీయం…!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజురోజుకూ దిగజారుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది నేతలు, కార్యకర్తలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. దీంతో సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయాల పట్ల ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అసహ్యం, నిరాసక్తతను పెంచుతోంది. తాజాగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై (Vemireddy Prasanthi Reddy) వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయ నాయకులు మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దాడులకు దిగడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేశాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి భువనేశ్వరిపై (Bhuvaneswari) వైసీపీ నాయకులు అసభ్య వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీలో ఆమెపై చేసిన కామెంట్స్ తో చంద్రబాబు భావేద్వానికి గురై ఏడ్చేసిన విషయం తెలిసిందే. ఆలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవాపై కూడా వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (YS jagan) సతీమణి వైఎస్ భారతిపై (YS Bharathi) టీడీపీ, జనసేన కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంఘటనలు రాజకీయ పార్టీల మధ్య పరస్పర దూషణలు, వ్యక్తిగత దాడుల సంస్కృతి ఎంతగా వేళ్లూనుకుందో తెలియజేస్తున్నాయి.
తాజాగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి బూతుల వల్లే వైసీపీ ఓడిపోయిందని, అయినా ఆ పార్టీకి బుద్ధిరాలేదని కొంతమంది నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. టీడీపీ నాయకుడు లోకేష్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళలను గౌరవించే సంస్కృతిని పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలని పిలుపునిచ్చారు.
నేతల అనుచిత వ్యాఖ్యలు కేవలం రాజకీయ నాయకుల మధ్య వివాదాలకు మాత్రమే పరిమితం కావట్లేదు. సమాజంలో మహిళల గౌరవాన్ని, భద్రతను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మహిళలపై దాడులు, అనుచిత వ్యాఖ్యలు సమాజంలో చెడు సందేశాన్ని పంపుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన శక్తి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే నాయకులకు ఓటు ద్వారా తగిన శాస్తి చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా తమ నాయకులకు కఠిన ఆదేశాలు జారీ చేసి, మహిళలపై దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి. రాజకీయాలు ప్రజల సంక్షేమం కోసం, సమాజ హితం కోసం ఉండాలి. అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు రాజకీయ నాయకుల స్థాయిని తగ్గిస్తాయి. ప్రజలు, మీడియా, సమాజం అంతా ఇలాంటి ప్రవర్తనను ఖండించి, బాధ్యతాయుత రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు గౌరవం దక్కుతుంది.