Adinarayana Reddy: ఏపీ రాజకీయాల్లో కలకలం.. డ్రగ్స్ కేస్ లో ఆరెస్టయిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు..
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన పెద్ద చర్చకు దారి తీసింది. భారతీయ జనతా పార్టీ ( BJP)కి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) కుమారుడు సుధీర్ రెడ్డి (Sudheer Reddy) డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో జరిగిన ఈ ఘటన ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
పోలీసులు హైదరాబాద్‌లోని నార్సింగి (Narsingi) ప్రాంతంలో డ్రగ్స్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన సమయంలో సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు చట్ట ప్రకారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు అక్కడి నుంచి ఆయనను డీ-అడిక్షన్ సెంటర్ (De-addiction Centre)కు తరలించారు. ఇదే సమయంలో మరో వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకున్న స్థితిలో పట్టుబడ్డాడని పోలీసులు వెల్లడించారు.
ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వ్యతిరేకంగా గట్టిగా చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు, యాత్రలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇది సుధీర్ రెడ్డిపై వచ్చిన మొదటి ఆరోపణ కాదని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో కూడా డ్రగ్స్‌కు సంబంధించిన అంశంలో ఆయన పేరు వినిపించినట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో వివాదం పెద్దగా ముందుకు వెళ్లకపోయినా, ఈసారి మాత్రం వైద్య పరీక్షల ఆధారాలతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారింది.
దీంతో ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తోంది. ఆయన మొదట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party – YSRCP) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో గెలిచిన తర్వాత కొద్ది కాలంలోనే పార్టీ మారి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP)లో చేరారు. అక్కడ మంత్రి పదవి కూడా పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి, 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. రాజకీయంగా చురుకైన నేతగా, ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తరచూ విమర్శలు చేసే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అటువంటి నాయకుడి కుటుంబ సభ్యుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా ఆయుధంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇస్తుందో, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. మరోపక్క ఈ విషయం రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ మాఫియా పై పలు రకాల అనుమానాలను కూడా లేవనెత్తుతోంది..






