AP Tourism: గ్లోబల్ టూరిజం అవార్డు..2025తో మెరిసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం పర్యాటక రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టూరిస్ట్ అవార్డ్ (Global Tourism Award) 2025ను రాష్ట్ర పర్యాటక శాఖ అందుకుంది. దేశవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి కృషి చేసినందుకు గుర్తింపుగా గ్లోబల్ న్యూస్ నెట్‌వర్క్ (Global News Network) ఈ అవార్డును ప్రదానం చేసింది.
మంగళవారం ఢిల్లీలో (Delhi) యశోభూమి (Yashobhoomi) లో జరిగిన కార్యక్రమంలో ఏపీ టూరిజం కన్సల్టెంట్ నిషితా గోయల్ (Nishita Goyal) రాష్ట్రం తరఫున ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించడంలో ఏపీ ప్రభుత్వం చూపిన దూరదృష్టి, దాన్ని అమలు చేసే తీరు ఈ గౌరవానికి కారణమని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి ప్రత్యేక స్థానం కల్పించాలని నిర్ణయించారు. సంపద సృష్టించడం ద్వారా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చాలనే లక్ష్యంతో టూరిజం రంగానికి కొత్త ఊపును ఇచ్చారు. ముఖ్యంగా కడప (Kadapa) జిల్లా గండికోట (Gandikota) ప్రాంతాన్ని ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి 103 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడం ఈ విజయానికి దారి తీసింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంలో సర్క్యూట్ విధానాన్ని అనుసరించింది. బీచ్ టూరిజం, ఆలయ పర్యాటక కేంద్రాలు, పర్యావరణ ఆధారిత గమ్యస్థానాలను పీపీపీ మోడల్ (PPP Model) ద్వారా అభివృద్ధి చేసే చర్యలు చేపట్టింది. ఈ విధానాలు రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అవార్డు రావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కేవలం 15 నెలలలోనే సాధించిన ఈ ప్రగతిని టీడీపీ (TDP) నాయకులు ముఖ్యమైన విజయంగా పేర్కొంటున్నారు. పర్యాటక రంగంలో చేసిన మార్పులు ప్రపంచస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఇక ఇటీవల అరకు (Araku) కాఫీకి చేంజ్ మేకర్ ఆఫ్ థ ఇయర్ (Changemaker of the Year Award) 2025 లభించగా, వారం రోజుల్లోనే మరో అంతర్జాతీయ గుర్తింపు రావడం రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నారు. పర్యాటక శాఖకు వచ్చిన గ్లోబల్ అవార్డు ఈ దిశలో ఒక చారిత్రాత్మక గుర్తింపు అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఇటీవల చేసిన ప్రగతి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా గుర్తింపు పొందుతోంది. గ్లోబల్ టూరిజం అవార్డు సాధించడం రాష్ట్రానికి మరింత పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.