Pakistan: సొంత ప్రజలపైనే దాడులు.. పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్..

పాకిస్తాన్ కు శత్రువులు ఎక్కడో లేరు.. సొంతదేశంలోనే సొంత ప్రజలే ప్రత్యర్థులుగా మారారు. అందుకే.. వారిపైనే అత్యాధునిక ఆయుధాలతో దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల పేరుతో విరుచుకుపడుతోంది. బలోచిస్థాన్ (Balochistan) సొంత ప్రజల పైనే దాడులు చేస్తోంది. పాక్ సేనలు వాడుతోన్న శతఘ్నులు, మోర్టార్లతో కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.
నాలుగు రోజులుగా డ్రోన్లతో జరుగుతోన్న ఈ ఆపరేషన్‌తో ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. వారికి ఆహారం, ఇంధనం కొరత ఏర్పడిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వరుస బాంబు దాడులతో పత్తి పొలాలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నాయి. ఛశ్మా ప్రాంతంలో శతఘ్నులు, మోర్టార్ల కారణంగా మరణాలు సంభవించినట్లు సమాచారం. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేదు (Pakistan). బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. వాటి అధీనంలో ఉన్న జెహ్రీని తిరిగి స్వాధీనం చేసుకొనే లక్ష్యంతో పాక్ సేనలు ఈ దాడులు చేస్తున్నాయి.
ఇటీవల కూడా పాక్ సొంత ప్రజలపై దాడులు చేసింది. గతనెల ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని మాత్రె దారా గ్రామంపై ఫైటర్ జెట్‌లు ఎల్‌ఎస్-6 రకం 8 బాంబులను(Pak Air Force Drops 8 Bombs) జార విడిచాయి. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా గతంలో ఈ ప్రావిన్స్‌లో దాడులు చేసింది.
ఈ ఏడాది జనవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే ఉగ్రదాడులు 42 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని పాక్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బలోచిస్థాన్ తర్వాత అత్యధికంగా ఉగ్రదాడులు జరిగేది ఈ ప్రావిన్స్‌లోనే అని చెబుతున్నాయి.