Chandrababu: ఆంగ్లం అవసరమే కానీ .. మాతృభాషను మరిచిపోతే : సీఎం చంద్రబాబు
మాతృభాష మన మూలాలకు సంకేతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుంటూరులో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో (World Telugu Conference) సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంగ్లం అవసరమే కానీ, మాతృభాషను మరిచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని తెలిపారు. సంక్రాంతి (Sankranthi) కంటే ముందు వచ్చిన పండుగ ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్ (NTR) పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయకం. దేశంలోనే తెలుగు భాషకు ఘనమైన చరిత్ర ఉంది. వందలాది భాషలు ఉన్నా, మన దేశంలో కేవలం 6 భాషలకే ప్రాచీన హోదా లభించింది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ మహాసభలకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయి. గిడుగు వెంకట రామ్మూర్తిన తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాణ్ణి, నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.
టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చు. కొత్త యాప్లు వచ్చాయి. తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయి. టైప్ చేయడానికి తెలియనివాళ్లు కూడా టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. పొట్టి శ్రీరాములు పేరుతో 1985లోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ తీసుకొచ్చారు. విభజన తర్వాత రాజమహేంద్రవరంలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు.






