Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసు నిందితులకు ఏసీబీ కోర్టు షాక్..!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam Case) నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడలోని యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) కోర్టు, ఈ కేసులో ఆరుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శి కె. ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే, వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. కేసు దర్యాప్తులో ఇది కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది.
2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించి కేసు నమోదైంది. 2024లో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో మొదట కేసు నమోదైంది. ఎక్సైజ్ విభాగం అధికారి ఫిర్యాదు మేరకు సీఐడీ దర్యాప్తు ప్రారంభించగా, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కి అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్, ఈ కేసులో దాదాపు రూ.3,500 కోట్ల ఆర్థిక అక్రమాలు జరిగినట్లు గుర్తించింది.
లిక్కర్ లైసెన్సుల కేటాయింపులో అవకతవకలు, షెల్ కంపెనీల ద్వారా కిక్‌బ్యాక్‌ల సేకరణ, ఆర్డర్ ఫర్ సప్లై (OFS) వ్యవస్థలో మార్పులు, కొన్ని బ్రాండ్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ బ్రాండ్లను అణచివేసి, కొత్త బ్రాండ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నెలకు రూ.50-60 కోట్లు కిక్‌బ్యాక్‌ల రూపంలో సేకరించినట్లు సిట్ ఆరోపించింది. ఈ కేసులో రాజ్ కెసిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి ప్రముఖులతో పాటు పలువురు అధికారులు, రాజకీయ నాయకులు నిందితులుగా ఉన్నారు.
ఆగస్టు 12న ఏసీబీ కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లపై వాదనలు వినింది. తర్వాత తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా, నిందితుల తరపు న్యాయవాదులు ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, తమ క్లయింట్లకు ఎక్సైజ్ పాలసీలో నేరుగా పాత్ర లేదని వాదించారు. అయితే, సిట్ తరపు న్యాయవాదులు, డిజిటల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులను సమర్పించి, నిందితుల పాత్రను స్పష్టం చేశారు. కోర్టు ఈ ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పింది. మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఇవాళ తీర్పు చెప్పింది. అలాగే వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది. ఈ కేసులో ఆరోపణల తీవ్రత, ఆర్థిక అక్రమాల స్వరూపం, దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉండటం వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మిథున్ రెడ్డి ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను కొన్ని కంపెనీలకు అనుకూలంగా ఆర్డర్లు ఇప్పించడం, కిక్‌బ్యాక్‌లు స్వీకరించడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అలాగే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎక్సైజ్ విభాగంలో నేరుగా జోక్యం చేసుకోనప్పటికీ, ఈ అక్రమాలలో పరోక్షంగా పాత్ర పోషించినట్లు సిట్ ఆరోపిస్తోంది. బాలాజీ గోవిందప్ప షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఆరోపణలను రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తుండగా, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్టు కావచ్చనే పుకార్లు కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.







