ABV – YCP: ఏబీవీ రాజకీయ ప్రవేశం.. వైసీపీలో ఎందుకీ ఆందోళన?
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Vevnkateswara Rao) రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించారు. ఏబీవీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో ఆందోళన వ్యక్తమైంది. సాక్షి పత్రికలో ఆయనపై కార్టూన్ వేసి మరీ విమర్శించారు. వైసీపీ నేతలు కూడా ఏబీవీ రాజకీయ ప్రవేశంపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఏబీవీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి ఎందుకంత భయం అని చాలా మంది ఆరా తీస్తున్నారు. సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పిన తర్వాత కూడా వైసీపీ ఎందుకంత రియాక్ట్ అవుతోందనేది ఆసక్తి రేపుతోంది.
అమలాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఏబీవీ వెల్లడించారు. పదవులు, అధికారం కోసం కాదని మెరుగైన సమాజం కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. జగన్ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను ప్రజల ముందుంచుతానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలవరానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ఏబీవీకి రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వ్యవస్థలపై లోతైన అవగాహన ఉంది. జగన్ హయాంలో జరిగిన కొన్ని వివాదాస్పద నిర్ణయాలను ఆయన బహిర్గతం చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్పై వ్యక్తిగతంగా కాకుండా, ఆయన పాలనలోని లోపాలను బహిర్గతం చేస్తానని చెప్పడం కూడా వైసీపీకి రుచించకపోవచ్చు. ఇది వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించే అంశంగా మారవచ్చనే ఆందోళన నెలకొంది. ముఖ్యంగా, ఏబీవీ కోడికత్తి శ్రీను (Kodikathi Seenu) వంటి బాధితులకు అండగా నిలుస్తానని చెప్పడం, జగన్ హయాంలో జరిగిన అన్యాయాలను బయటపెడతానని ప్రకటించడం వైసీపీలో భయాన్ని మరింత పెంచింది.
సాక్షి (Sakshi) పత్రికలో ఏబీవీపై (ABV cartoon) కార్టూన్ ప్రచురించడం, ఆయన కోడికత్తి శ్రీనును కలవడాన్ని జగన్పై కుట్రగా చిత్రీకరించడం వైసీపీ రక్షణాత్మక వైఖరిని సూచిస్తోంది. ఏబీవీని రాజకీయంగా ఎదుర్కోవడం కంటే వ్యక్తిగత ఆరోపణలతో దాడి చేయడం ద్వారా ఆయన ప్రభావాన్ని తగ్గించాలని వైసీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఏబీవీ ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. “నేను నెమ్మదిగా బాంబులాంటి సంగతులను బయటపెడతాను” అని ఏబీవీ హెచ్చరించారు. ఏబీవీ ఏ పార్టీలో చేరతారో చెప్పలేదు. అయినా తన పోరాటం మాత్రం జగన్ మీదే అని క్లారిటీ ఇచ్చారు. జగన్ నెవర్ ఎగైన్ అని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, వైసీపీ ఇప్పటికే రాజకీయంగా బలహీన స్థితిలో ఉంది. ఈ సమయంలో ఏబీవీ వంటి ప్రభావవంతమైన వ్యక్తి జగన్ (YS Jagan) అక్రమాలను బహిర్గతం చేస్తానని చెప్పడం పార్టీకి మరింత నష్టం కలిగించవచ్చు. ఏబీవీ నీతి, నిజాయితీకి పేరుగాంచిన వ్యక్తిగా, ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీనికి తోడు, ఆయన ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడం వైసీపీకి రాజకీయంగా ఎదుర్కోవడం కష్టతరంగా మారింది.






