Vivek Ramaswamy: ఒహియో గవర్నర్ పదవిపై వివేక్ చూపు..?
Washington: భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) తన సొంత రాష్ట్రం ఒహియో(Ohio) నుంచి గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది.ఈ పోటీ గురించి రామస్వామి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రూపొందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE)కి వివేక్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ సంయుక్త సారథులుగా వ్యవహరిస్తున్నారు. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ పని చేస్తోంది.
అమెరికా 250వ స్వతంత్ర దినోత్సవం జరుపుకొనే 2026 జులై 4వ తేదీలోపు డోజ్ లక్ష్యాన్ని పూర్తి చేసి, గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివేక్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఒహియో గవర్నర్ ఎన్నికలు నవంబర్ 2026లో జరగనున్నాయి. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కోసం రామస్వామి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.
38 ఏళ్ల ఈ బయోటెక్ పారిశ్రామికవేత్త నిస్సంకోచంగా మాట్లాడతారనే పేరుంది. ట్రంప్ తరఫున ఇంటర్వ్యూల్లో వాదనలు వినిపించారు. రామస్వామి పనితీరును గమనించిన డొనాల్డ్.. పెన్సిల్వేనియాలో జరిగిన సభలో ఆయన్ను తన కార్యవర్గంలోకి తీసుకొంటానని ప్రకటించారు. మొదట ఆయనకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ట్రంప్ ప్రచార బృందంలో కీలక భూమిక వహించిన మార్కో రూబియో (Marco Rubio)కు ఆ శాఖ దక్కే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఒహియోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కేరళ నుంచి ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటారు. హార్వర్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యేల్ లా స్కూల్లో ఉన్నతవిద్యను పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం సొంతంగా బయోటెక్ సంస్థ (Roivant Sciences)ను స్థాపించారు.






