America: చెదురుతున్న డాలర్ డ్రీమ్స్.. లిమిట్ ఓవర్ అంటున్న అమెరికా
అగ్రరాజ్యం అమెరికా అంటే అవకాశాల స్వర్గం. అందుకే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి యువత.. తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు అమెరికా బాటపడుతున్నారు. అది కొన్ని దశాబ్దాల నుంచి మరింత అధికమైంది. మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారంటూ చెప్పుకోవడం స్టేటస్ సింబల్ గా మారింది.అయితే నెమ్మదిగా ఆపరిస్థితి తగ్గుతోంది. ఎందుకంటే.. క్రమంగా అమెరికా సైతం వలసలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా మారిన రాజకీయ పరిస్థితులతో అమెరికా హెచ్–1బీ వీసా ఆశలపై నీళ్లు చల్లింది. ఈమేరకు అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా కీలక ప్రకటన చేసింది.
లిమిట్ ఓవర్..
2025 సంవత్సరానికి భారతీయులకు జారీ చేసే హెచ్–1బీ వీసాల లిమిట్‌కు మించి దరఖాస్తులు(limit over) వచ్చినట్లు ప్రకటించింది అమెరికా. దీంతో ఇక దరఖాస్తులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెగ్యులర్ అప్లికెంట్స్ లిమిట్ 65 వేల మార్కును, యూఎస్ అడ్వాన్స్ డిగ్రీ హోల్డర్ల కోసం నిర్దేశించిన 20 వేల వీసాల లమిట్ చేరుకున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో సెలెక్ట్ అయినవారు, కానివారి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు వీసా దరఖాస్తు చేసుకునేవారి ఆశలు ఆవిరయ్యాయి.
వాస్తవానికి అమెరికా …హెచ్–1బీ వీసా(H1B VISA)లను తాత్కాలిక ఉద్యోగులు, విద్యార్థులకు జారీ చేస్తుంది. ఈ వీసాల కోసం దరఖాస్తుదారులు డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, మెడిసిన్, ఎడ్యుకేషన్, బిజినెస్, లా అండ్ ఆర్ట్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా అర్హత గల ఫీల్డులు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీలు 2024లో తక్కువ హెచ్–1బీ వీసాలను స్పాన్సర్ చేశాయి. ఇక అమెరికా 2023లో విదేశీ విద్యార్థుల కోసం 3,86,000 హెచ్–1బీ వీసాలు జారీ చేసింది. వీటిలో భారతీయులే 72 శాతం దక్కించుకున్నారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(trump) గెలిచారు. 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు(universities) అప్రమత్తమయ్యాయి. అమెరికా వెలుపల ఉన్న విద్యార్థులు జనవరి 20లోపు అమెరికాకు రావాలని సమాచారం ఇస్తున్నాయి. తాజాగా వీసాల లిమిట్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించి నిలిపివేసింది అమెరికా.






