TRUMP warning: డాలర్ తో పెట్టుకుంటే అంతే.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరికలు
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్.. అప్పుడే తనమార్క్ చూపించారు.అమెరికా డాలర్ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తే బ్రిక్స్ కూటమి దేశాలపైన 100 శాతం సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆయా దేశాలకు అమెరికా మార్కెట్లోకి (america markets) ప్రవేశం లేకుండా తలుపులు మూస్తానన్నారు. ‘ట్రూత్ సోషల్’ (truth social) అనే సోషల్ మీడియా వేదికలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ‘కొత్తగా ఎటువంటి బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని, బలమైన అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరే ఇతర కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని బ్రిక్స్ దేశాలు మాకు హామీ ఇవ్వాలి. లేకపోతే వారు 100 శాతం సుంకాలు చెల్లించటానికి సిద్ధపడాలి. అంతేకాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి అమ్మకాలు జరపకూడదు’ అని పేర్కొన్నారు ట్రంప్.
అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ స్థానాన్ని బ్రిక్స్ భర్తీ చేయటం సాధ్యం కాదన్నారు. ఏ దేశం ఈ దిశగా ప్రయత్నించినా..అమెరికాకు టాటా చెప్పాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ట్రంప్ సుంకాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికాలోకి పెద్ద ఎత్తున అక్రమ వలసలకు, డ్రగ్స్ సరఫరాకు మెక్సికో, కెనడా కారణమవుతున్నాయని.. ధోరణి మార్చుకోకపోతే వాటి ఎగుమతులపైన 25 శాతం సుంకం విధిస్తానని, ఇదే కారణాలతో చైనా మీద 10 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరులో రష్యాలో జరిగిన బ్రిక్స్ కూటమి సమావేశంలో.. సభ్యదేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీల్లో డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలను ఉపయోగించాలన్న ప్రతిపాదన వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా ప్రకటన చేశారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రాభవం బలంగా ఉంది. చమురు వంటి కీలకమైన సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే జరుగుతున్నాయి. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వాటా దాదాపు 58 శాతం ఉంది. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించుకోవడంపై దృష్టిపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల పిలుపునిచ్చారు. మరోవైపు బ్రిక్స్ కూటమిలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది. ఈనేపథ్యంలో స్పందించిన ట్రంప్.. ఈ వార్నింగులు జారీ చేశారు.






