America: ట్రంప్, మస్క్ గొడవ.. రిపబ్లికన్లలో ఆందోళన..

నాడు ఇద్దరు మంచి స్నేహితులు.. నేడేమో బద్దశత్రువుల్లా మారారు. ఇద్దరు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు.అమెరికాలో ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తుల మధ్య చెలరేగిన ఘర్షణ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా వ్యాఖ్యలు చేసుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) లు ఎవరి పనిలో వారు పడిపోయారు. తాను వేరే పనులతో బిజీగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించగా.. ‘ద అమెరికా పార్టీ’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. మరోవైపు ఇద్దరూ కాస్త తగ్గాలని రిపబ్లికన్లు పిలుపునిచ్చారు.
‘నేను బిజీగా ఉన్నా. చైనా, రష్యా, ఇరాన్ అంశాలపై పని చేస్తున్నా. నాకు చాలా పనులున్నాయి. మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఆయన (మస్క్) చాలా సబ్సిడీలు పొందారు. పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారు. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతా పారదర్శకంగానే జరిగిందా.. అనేది చూడాలి. మస్క్ లేకపోయినా మా ప్రభుత్వం కొనసాగుతుంది. ఎవరు లేకపోయినా అమెరికాకు ఏం కాదు.. ఒక్క నేను తప్ప’ అని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్‌తో ప్రైవేటుగా మాట్లాడాలని తాను ప్రయత్నిస్తున్నానంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. ‘నాకు అలాంటి ప్రణాళికలు ఏమీలేవు. ఎవరో తప్పుగా ఆ కథనాలు రాసి ఉంటారు. నేను దాని గురించి ఆలోచించట్లేదు. ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. ఎలాన్ మస్క్‌కు మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు’ అంటూ విభేదాలను మరింత పెంచేలా ట్రంప్ మాట్లాడారు.
వెనక్కి తగ్గిన మస్క్
ట్రంప్‌పై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయి విమర్శలు చేసిన మస్క్ కాస్త వెనక్కి తగ్గారు. ట్రంప్‌పై చేసిన బిగ్‌బాంబ్ పోస్టును ఆయన తొలగించారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరుందని మస్క్ ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకూ బహిరంగంగా బయటపెట్టలేదని తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు భవిష్యత్తులో దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. తాజాగా ఆ పోస్టును మస్క్ తొలగించారు.
పార్టీ పేరుపై మస్క్ వ్యాఖ్య
ట్రంప్‌నకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్న మస్క్.. 80 శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ ఫాలోవర్లను ‘ఎక్స్’లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే.. ఆ ఓటింగ్ ఫలితాన్ని ప్రకటిస్తూ.. ‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే. దీన్ని 80శాతం మంది సమర్థించారు’ అని పేర్కొన్నారు. ‘ద అమెరికా పార్టీ’ అంటూ మస్క్ ఈ పోస్టు చేయడం కలకలం రేపింది. అయితే అమెరికాలో పుట్టని మస్క్‌కు అధ్యక్షుడయ్యే అవకాశం లేదు. ట్రంప్, మస్క్‌ల మధ్య విభేదాలతో షాక్‌కు గురైన రిపబ్లికన్లు శాంతి మంత్రం పఠిస్తున్నారు. ఇద్దరూ మళ్లీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నామని సెనేటర్ టెడ్ క్రజ్ అభిప్రాయపడ్డారు. అప్పుడే దేశానికి మంచి చేయగలమని స్పష్టం చేశారు. ఇంకా పలువురు సెనేటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు వారిద్దరి మధ్య సయోధ్య కుదరాలని ఆకాంక్షించారు.