Pawan Kalyan: ఒక్కొక్క చోట ఒక్కో మాట.. పవన్ పై పెరుగుతున్న ట్రోలింగ్..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఆయన చేసే ప్రసంగాలు, మాటలలో వచ్చే తేడాలు ఆయనపై వస్తున్న ట్రోల్స్ కి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా, ఒకే విషయం గురించి విభిన్న సందర్భాల్లో విభిన్నంగా స్పందించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. దీనివల్ల జనసేన శ్రేణులలోనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల హిందీ భాషపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న వైఖరి పై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీని (BJP) “హిందీ జనతా పార్టీ” అంటూ హేళన చేసిన పవన్, ఇప్పుడు హిందీని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నట్లుగా నెటిజన్లు అంటున్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొనడాన్ని, అప్పుడే ప్రారంభమైన హిందీ సానుకూల వైఖరిగా వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక, ప్రస్తుతం హిందీ భాష నేర్చుకోవడాన్ని సమర్థిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు గతంలో తాను త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించిన సందర్భాలను గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ మతపరమైన వ్యాఖ్యల విషయంలోనూ స్పష్టత లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు తాను మతాలు, కులాలు నమ్మనని చెబుతూ, చేగువేరా (Che Guevara), లెనిన్ (Lenin) వంటి నేతలను ఆదర్శంగా చెప్పుకున్న పవన్, ఇప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. తిరుపతి (Tirupati)లో దీక్షలు చేయడం, కాషాయ దుస్తులు ధరించడం వంటి చర్యలను కొందరు రాజకీయ ఎత్తుగా భావిస్తున్నారు. గత వ్యాఖ్యలతో ఇప్పటి వైఖరిలో తేడా ఉండటంతో నెటిజన్లు ఈ విషయంలోనూ ట్రోల్స్ చేస్తున్నారు.
పుట్టిన ప్రాంతం గురించి కూడా పవన్ కళ్యాణ్ వివిధ వేదికలపై భిన్నంగా మాట్లాడటం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికి వెళ్లినా “ఇక్కడ పుట్టి ఉంటే బాగుండేది” అని చెబుతూ, ఒక్కో సందర్భంలో కర్నూల్ (Kurnool), మరోసారి నెల్లూరు (Nellore), మరొకచోట పాలకొల్లు (Palakollu) అని పేర్కొనడం పై కూడా సోషల్ మీడియాలో వివిధ పోస్టులు హైలెట్ అవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల, ముఖ్యంగా ఓ కీలక పార్టీకి నాయకత్వం వహిస్తున్న నేతగా పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో అవిశ్వాసం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఆయన భవిష్యత్తులో తన వ్యాఖ్యలు, ప్రసంగాలపై జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ పరిశీలకుల సూచన.