Donald Trump: టారిఫ్ లపై తగ్గేదే లేదు.. కోర్టులు ఆపితే ప్రత్యామ్నాయాలన్న ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి కేవలం ట్రంప్ టారిఫ్ లపైనే ఉంది. ఎందుకంటే అధ్యక్షుడుట్రంప్.. ఎడాపెడా టారిఫ్ లతో వాయించేస్తున్నారు. తన మాట వినకుంటే… ఇష్టానుసారం టారిఫ్ పెంచేస్తున్నారు. దీంతో చాలా మంది ట్రంప్ టారిఫ్ లపై యూఎస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. కాసేపట్లో దీనిపై యూఎస్ కోర్టు తీర్పివ్వనుంది. ఇంతకూ ఈ తీర్పు ఎలా ఉండనుందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
మరోవైపు.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం.. టారిఫ్ లను గట్టిగా సమర్థించుకుంటున్నారు.ఒకవేళ తాను విధించిన సుంకాలను (Trump Tariffs) న్యాయస్థానం అడ్డుకుంటే.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతామని ఆయన వెల్లడించారు.
‘‘చైనా ప్రయోజనాలకు మద్దతు కల్పించే ఉద్దేశంతోనే కొందరు ఈ టారిఫ్లను సవాల్ చేస్తూ కేసులు వేశారు. ఒకవేళ కోర్టు సుంకాలను వ్యతిరేకిస్తే మా ప్రభుత్వం కచ్చితంగా ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషిస్తుంది. నేను విధించిన టారిఫ్ల (Tariffs on Countries) వల్ల తక్కువ సమయంలోనే ఫెడరల్ బడ్జెట్ ద్రవ్యలోటు 27శాతం వరకు తగ్గింది. ఈ సుంకాల వల్ల అమెరికాలో వినిమయ ఖర్చులు పెరిగాయని విమర్శకులు అంటున్నారు. అది నిజం కాదు. ఈ టారిఫ్లను విదేశాలే చెల్లిస్తున్నాయి. అమెరికాలోని కొనుగోలుదారులకు ఎలాంటి సమస్యా ఉండదు. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైందే’’ అని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే పలు దేశాలపై సుంకాల బాదుడు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం అగ్రరాజ్య సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీనిపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. టారిఫ్ల విషయంలో ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అతిక్రమించారా? లేదా? అనేది కోర్టు నిర్ణయించనుంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ట్రంప్ వరుసగా పోస్టులు పెడుతున్నారు. తాను విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టేస్తే తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుంటామని, ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించడం అసాధ్యమని ఆయన అన్నారు.






