Iran: ఇరాన్ పై అమెరికా టారిఫ్ వార్….
ఓవైపు ఇరాన్ ఆందోళనలకు అమెరికా బహిరంగంగా మద్దతిస్తోంది.దేశభక్తులైన ఇరాన్ యువతా… మీరు ఆందోళనలను కొనసాగించండంటూ సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పటికే బహిరంగంగా పిలుపునిచ్చారు కూడా. అయితే దీనికి తోడు ఇరాన్ వెన్ను విరిచేందుకు అమెరికా టారిఫ్ అస్త్రాన్ని బయటకు తీసింది. ఆర్థికంగా ఇరాన్ ను మరింత కుంగదీసే చర్యలకు పదను పెట్టింది.
ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై అదనంగా 25 శాైతం పన్ను విధిస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అది వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తోపాటు బ్రెజిల్, చైనా, రష్యా, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలకు రంగం సిద్ధమవుతోందని, అయినా అక్కడి ఆందోళనల్లో వందల మంది మరణించడంతో ఆంక్షలను అమల్లోకి తేవాల్సి వస్తోందని ట్రంప్ తెలిపారు.
ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. ‘మా దేశం శత్రువుల ముందు తలొగ్గదని పలుమార్లు చెప్పాం. ఇప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు తమ మోసపూరిత చర్యలు ఆపాలి. మా దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి వ్యక్తులపై ఆధారపడటం మానేయాలి. ఇరాన్ బలమైన, శక్తిమంతమైన దేశం. మాకు శత్రువు గురించి తెలుసు. వారిని ఎదుర్కోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం’ ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు.






