Iran: ఇరాన్ లో మారణహోమం.. వేలాది మంది మృతి..?
ఇరాన్ ఆందోళనలు కాస్తా మారణహోమానికి దారితీశాయి. ప్రభుత్వం గద్దె దిగడమే లక్ష్యంగా సాగుతున్న ఈఆందోళనలను.. ప్రభుత్వం అత్యంత కఠినంగా అణచివేస్తోంది. ఆందోళనకారులను అణచివేసే క్రమంలో ఆ దేశంలో భారీ విధ్వంసమే చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో (Iran Protests) మృతుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు తెలియడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇరాన్ (Iran) ఆందోళనల్లో ఇప్పటివరకు 2,571 మంది మృతి చెందినట్లు అమెరికా కేంద్రంగా పని చేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించింది.
వీరిలో 2,403 మంది ఆందోళనకారులు కాగా.. 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనలతో సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు 18,000 మందికి పైగా నిరసనకారులను భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణల్లో మరణాల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఆందోళనల నేపథ్యంలో ఇరాన్లో ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్‌లింక్ ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘాలు వెల్లడించగా.. స్టార్‌లింక్ మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.
మరణశిక్ష అమలుచేస్తే ప్రతిచర్య తీవ్రమే: ట్రంప్
ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపిన ఇరాన్.. తాజాగా ఓ నిరసనకారుడికి మరణశిక్ష అమలుచేసేందుకు సిద్ధమైంది. ఆందోళనల్లో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానిని ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని బహిరంగంగా ఉరితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మానవహక్కుల సంఘాలు, మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వార్తలపై ట్రంప్ స్పందించారు. అలాంటి పనులు చేస్తే తమ ప్రతిచర్య చాలా తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు.
అమెరికా బెదిరింపులపై ఇరాన్ స్పందించింది. ఇరాన్ పౌరుల పాలిట ప్రధాన హంతకులు ఇద్దరే ఇద్దరంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్లో ఆందోళనలు జరిగేలా ఆ రెండు దేశాలే రెచ్చగొడుతున్నాయని దుయ్యబట్టింది.






