Russia: ట్రంప్ పొరపాటు నిర్ణయం.. అణు ఒప్పందం నుంచి రష్యా ఔట్..

రష్యా కోరుకుంటున్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారా..? లేదా ట్రంప్ చేస్తున్న పొరపాట్లను రష్యా అనుకూలంగా మార్చుకుంటుందా..? ప్రశ్న ఏదైనా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎంతగా ప్రయత్నించినా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేకపోతున్నారు. ముఖ్యంగా పుతిన్ తో చర్చలు జరుపుతున్నా.. అవి కొలిక్కి రావడం లేదు. ఈఅసహనం ట్రంప్ లో తారస్థాయికి చేరింది. దీంతో రష్యాను బెదిరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. అయితే ఇలాంటివి ఎన్నో చూసిన పుతిన్ .. వీటిని ఖాతరు చేయడం లేదు. దీంతో రష్యాను హెచ్చరించేలా అణు జలాంతర్గాములను మోహరించాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ పరిణామాలపై రష్యా ఆగ్రహించింది.
రష్యాను బెదిరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీసుకున్న తొందరపాటు నిర్ణయం యూరోపియన్ దేశాలకు ప్రాణసంకటంగా మారనుంది. మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్‌ల మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్ (Intermediate‑Range Nuclear Forces (INF) Treaty) ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని ఆరోపించింది. ఈక్రమంలో ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని తేల్చిచెప్పింది. రష్యా విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము కొన్నిరకాల క్షిపణులను మోహరించకుండా విధించుకొన్న ఆంక్షలను ఇక పాటించబోమంది.
అమెరికా (USA) దళాలు ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ క్షిపణి లాంచర్లను మోహరించడం, ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం దీనికి ప్రధాన కారణంగా వెల్లడించింది. మరోవైపు ట్రంప్ చర్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. ఇటీవలే రష్యా (Russia) మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ ప్రకటనకు స్పందనగా.. రెండు ఒహైయో శ్రేణి అణు జలాంతర్గాములను మోహరించేలా ఆదేశాలు జారీ చేశారు.
అసలేమిటీ ఐఎన్‌ఎఫ్ ఒప్పందం..?
1987లో అమెరికా (USA) అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, రష్యా (Russia) అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీగా దీనిని వ్యవహరిస్తారు. దీనిప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి రేంజి క్షిపణుల మోహరింపును నిషేధించారు. 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల మధ్యలోవి ఈ ఒప్పంద పరిధిలోకి వస్తాయి. అప్పట్లో ఐఎన్‌ఎఫ్ ట్రీటీ కారణంగా సోవియట్ అమెరికాలకు చెందిన దాదాపు 2,692 క్షిపణులను ధ్వంసం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని ప్రచ్ఛన్న యుద్ధాన్ని మలుపుతిప్పిన సంధిగా భావిస్తారు. వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్ రేంజి క్షిపణుల మోహరింపుతో అమెరికా మిత్రులైన యూరప్ దేశాలకే ప్రధాన ముప్పు అని చెప్పవచ్చు.
2019లో ట్రంప్ (Trump) ఈ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు లాగేశారు. రష్యా సుదీర్ఘకాలంగా దీనిని ఉల్లంఘిస్తోందని ఆయన నాడు ఆరోపించారు. 9ఎం729 లేదా ఎస్‌ఎస్‌సీ-8 క్షిపణులను మోహరించిందని పేర్కొన్నారు. దీనిని మాస్కో తిరస్కరించింది. ఇప్పుడు ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరింపు ఆదేశాలు వెలువడిన మూడు రోజులకు రష్యా కూడా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని ప్రకటించింది.