రిపబ్లికన్లు అలా..? డెమొక్రాట్లు ఇలా..?
యుద్ధం ముందు అస్త్రసన్యాసం చేసినట్లుగా డెమొక్రాట్ల పరిస్థితి తయారైంది.తాము ఎవరి ఆధ్వర్యంలో ఎన్నికల్లో తలపడదాం అనుకుంటున్నారో.. వారే ఇప్పుడు ఆపార్టీకి గుదిబండలా తయారయ్యారు. వృద్ధాప్యం తెచ్చిన మానసిక సమస్యలతో తరచూ నోరుజారుతూ.. పార్టీ నాయకులను ఆందోళనకు గురి చేస్తున్నారు. దీనికి తోడు ట్రంప్ పై జరిగిన దాడితో.. రిపబ్లికన్లకు మరింత ఆదరణ పెరిగినట్లు సర్వేలు చెబుతుండడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
మరోవైపు.. రిపబ్లికన్లలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఒకొక్కరిగా కీలక నేతలు.. ట్రంప్ నకు మద్దతు ప్రకటిస్తున్నారు. లేటెస్టుగా కీలకనేత నిక్కీహేలీ.. తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.మిల్వాకీలో జరిగిన నేషనల్ కన్వెన్షన్‌లో ఆమె ప్రసంగించారు. బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధాలు జరగవంటూ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌నకు ఓటేయాలంటే ఆయనతో 100 శాతం ఏకీభవించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘‘ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్ క్రిమియాను ఆక్రమించారు. బైడెన్ అధికారంలో ఉండగా.. మొత్తం ఉక్రెయిన్‌పైనే దండెత్తారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పుతిన్ ఏమీ చేయలేదు. ఆక్రమణలు, యుద్ధాలు ఏమీ లేవు. ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తారని తెలిసే అప్పట్లో పుతిన్ ఉక్రెయిన్ను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు. బలమైన నాయకుడు యుద్ధాలను ప్రారంభించరు. వాటిని ఆపుతారు’’ అని హేలీ వ్యాఖ్యానించారు.
అమెరికాలో శాంతి భద్రతలను పునరుద్ధరించాలంటే ట్రంప్‌నకు ఓటేయాలని భారత సంతతికి చెందిన మరో కీలక రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడాలంటే ఆయన అధికారంలోకి రావాల్సిందేనన్నారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా తీర్చిదిద్దాలంటే ట్రంప్‌తోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. ఆయన కేవలం మాటలతోనే కాకుండా.. తన చేతలతో దేశాన్ని ఏకం చేస్తారని తెలిపారు. అమెరికాకు కావాల్సింది అదేనని.. అందుకే ప్రతిఒక్కరూ ఆయనకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు మద్దతు ఇస్తున్నట్టు మస్క్ ప్రకటించారు.. ట్రంప్ గెలిచేందుకు భారీ ఎత్తున నిధులు సమకూర్చేందుకు మస్క్ సిద్ధమయ్యారు. నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రతినెలా దాదాపు 45 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీ లో చెప్పాలంటే 376 కోట్లు ఇచ్చేందుకు మస్క్ ప్రణాళికలు రూపొందించారు. దీనికి సంబంధించి పలు కథనాలు సైతం వెలువడ్డాయి.






