Delhi: మిత్రదేశమైనా లిమిట్స్ ఉంటాయి మరి..! అమెరికాకు తొలిసారిగా భారత్ కౌంటర్..
అగ్రరాజ్యం అమెరికా- భారత్ సంబంధాలు మొన్నటివరకూ చాలా ధృడంగా సాగాయి. ఒబామా, బైడన్ సహా అందరు నేతలు ఈ బంధాన్ని మరింత పటిష్టం చేయడానికే ప్రయత్నించారు. దీంతో అమెరికాకు.. భారత్ దగ్గరవుతుందన్న అనుమానాలు మిత్రదేశాల్లోనూ వ్యక్తమయ్యాయి. ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ప్రధాని మోడీ.. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ మంచిమిత్రులమంటూ ప్రకటనలు వచ్చాయి. అలాంటిది ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం.. ఇప్పుడు భారత్ ను అగ్రరాజ్యానికి దూరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు.. డెడ్ ఎకానమీ అంటూ భారత ఆర్థికవ్యవస్థపై ట్రంప్ కామెంట్లు.. మరింత చేటు తెస్తున్నాయి కూడా.
ఈ తరుణంలో నేరుగా భారత్.. అగ్రరాజ్యం అమెరికాపై కామెంట్స్ చేసింది. భారత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని (India Development)) కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) అన్నారు. అందరికీ మేమే బాస్ అనుకునే వాళ్లకు భారత్ వృద్ధి నచ్చలేదని అన్నారు. తమతో సమానంగా భారత్ మారకూడదనే అహంకారంతో..దేశాభివృద్ధిని కుంటుపడేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump)ను ఉద్దేశిస్తూ మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఆ దేశాల ఉత్పత్తుల కంటే భారత వస్తువులు, ఉత్పత్తులు మరింత ఖరీదయ్యేలా చేయడానికి అధిక సుంకాలు (Tariffs) విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశాభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు.
భారత్ అతిత్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారనుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అందువల్ల ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం మోడీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు. మన దేశాన్ని తయారీ, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ‘మేకిన్ ఇండియా’ వల్ల వివిధ రంగాల్లోస్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశ రక్షణ ఎగుమతులు రూ.24,000 కోట్లు దాటాయని.. ఇవి రక్షణ రంగ బలాన్ని, అభివృద్ధిని సూచిస్తున్నాయని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాజ్‌నాథ్ సింగ్ రైలు, మెట్రో కోచ్ తయారీ యూనిట్ ‘గ్రీన్‌ఫీల్డ్ రైల్ కోచ్ తయారీ కేంద్రం’కు శంకుస్థాపన చేశారు. 60 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీ మెట్రో రైళ్లు, వందే భారత్ రైళ్లకు కోచ్‌లను తయారు చేస్తుంది. రూ.1,800 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ 2026లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.







