Washington: ట్రంప్ వదలడు.. పుతిన్ తగ్గడు.. అమెరికా-రష్యా చర్చలు సమస్యను పరిష్కరించేనా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గొప్ప వ్యాపార వేత్త. క్లిష్ట సమయాల్లో అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లడంతో తనకు తనే సాటి. అలా పోరాటం చేసే రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. తను అనుకున్నది జరగాల్సిందే.. లేదంటే ఎంతకైనా తెగించే రకం. అందులో అవసరమైతే ప్రపంచదేశాలను బెదిరిస్తారు కూడా. అది ఇప్పటికే నిరూపితమైంది. అలాంటి ట్రంప్ ను… చికాకు పెడుతోంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. తన అధికారంలో రాగానే యుద్ధాన్ని ఆపించేస్తామన్న ట్రంప్.. ఇప్పుడు ఆయుద్ధం ఆపేందుకు నానా తంటాలు పడుతున్నారు. కాదు అతన్ని అంతగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు రష్యా అధినేత పుతిన్.
ఇక పుతిన్ విషయానికొస్తే.. ఈయన మహా టక్కరి. ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేస్తాడో.. ప్రత్యర్థులు తెలుసుకునేలోపే చిత్తు చేయడం ఈయన స్పెషల్. అమెరికా అధ్యక్షుడిని ఆకాశాని కెత్తేస్తూనే.. చర్చల్లో తగ్గేది లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు పుతిన్. దీంతో పుతిన్ ను ఎలాగైనా దారికి తేవాలని ట్రంప్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు వ్యాపార పరంగా ఒత్తిడి తెస్తూనే .. మరోవైపు చర్చలకు రావాలంటూన్నారు. దీనికి ముహూర్తం కూడా పెట్టేశారు. అయితే అటువైపు పుతిన్ కదా.. అలాగే కౌంటరుంటుంది మరి..!
అయినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump).. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky)ని కూడా ఆహ్వానించడానికి ట్రంప్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి అలాస్కాలో పుతిన్, జెలెన్స్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ముందే ట్రంప్ భావించారు. ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు.
దీనిపై క్రెమ్లిన్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. తొలుత పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాలని యోచించారు. ఈ నేపథ్యంలో భేటీకి జెలెన్స్కీ (Zelensky)ని ఆహ్వానించడంపై ట్రంప్ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. శాంతి చర్చల్లో కీవ్‌ను కూడా భాగం చేయాలని యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, ఫిన్లాండ్ వంటి యూరోపియన్ దేశాలు (European Allies) అగ్రరాజ్యానికి విజ్ఞప్తి చేయడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.







