Modi-Trump: ఫిబ్రవరి 12-13 తేదీల్లో భారత ప్రధాని – అమెరికా అధ్యక్షుల సమావేశం
రోజుకో నిర్ణయంతో దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఏ విషయాలు చర్చించ బోతున్నారు?
సాధారణంగా దేశ ప్రధాన మంత్రి, లేదా ఇతర మంత్రులు అనేక దేశాలు వెళుతూ ఉంటారు. అనేక దౌత్యపరమైన, వాణిజ్య పరమైన విషయాలు చర్చించిన తరువాత ఆ నిర్ణయాలు, కార్యక్రమాలు, లేదా ప్రణాళికలు ప్రకటిస్తారు. అయితే ఈ నెల 12-13 తేదీలలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ(Modi) అమెరికా నూతన అధ్యక్షులు శ్రీ డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ని కలవబోవడం, రెండు రోజులు సమావేశాలు, ఉండడం, సమావేశాల తరువాత ప్రకటించే నిర్ణయాల మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.
గత 20 రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రపంచంలోని అన్ని దేశాలు ఆశ్చర్య పోయాయి. చాలా దేశాలు ఖండించాయి. అయితే భారత దేశానికి సంబంధించిన అనేక విషయాలు వున్నా, ముఖ్యంగా చర్చించాల్సిన విషయాలు అక్రమ వలసదారులు (Illegal migrants), అమెరికాలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు (legal immigrants) మీద జరిగే చర్చలు గురించి అందరు ఎదురు చూస్తున్నారు.
అయితే ఇండియా లో మీడియా ఈ రెండు విషయాలు (అక్రమ వలస దారులు & లీగల్ గా చదువు కుటున్న స్టూడెంట్స్) మీద వార్తా కధనాలు విడుదల చేస్తూ ఉండటం వలన భారత ప్రజలలో ముఖ్యం గా తెలుగు రాష్ట్రాలలో అందోళన ఎక్కువవడం సహజమే కదా! ట్రంపు వచ్చిన వెంటనే, రాకముందు అనేక సార్లు చెప్తూనే ఉన్నాడు అమెరికా ముందెన్నడూ చూడని అతి పెద్ద వలసదారులను పంపించే కార్యక్రమం ఉంటుంది అని తాను చెప్పిన విధంగానే చేయడం మొదలెట్టాడు.
మొదటగా బర్త్ రైట్ సిటిజన్ షిప్ నిర్ణయం మీద భారతీయులు చాలా ఆందోళన పడ్డారు. అనేక మంది మహిళలు, అందులో భారతీయ మహిళలు, తెలుగు వారు కూడా తమ తమ డాక్టర్ ల దగ్గరికి వెళ్లి ఫిబ్రవరి 19 లోగా సి సెక్షన్ ద్వారా డెలివరీ చేయమని రిక్వెస్ట్ చేశారు అని మనందరం చర్చించుకున్నాం. ఈ లోపలే అమెరికా దేశం లోనే ఆ ఆర్డర్ మీద పెద్ద ఎత్తున నిరసన రావడం, దాదాపు 22 రాష్ట్రాలలో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్ట్ లలో పిటిషన్ లు వేయడం, సియాటెల్ నగరం లాంటి చోట్ల ఆ ప్రభుత్వ నిర్ణయం చెల్లదని కొట్టి వేయడం తో బర్త్ రైట్ సిటిజన్ షిప్ మీద వార్తలు ఆగి పోయాయి.
ఆ తరువాత F వీసా మీద ఉన్న స్టూడెంట్స్ వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పనిచేయాలని, అది కూడా వారు చదువుకున్న క్యాంపస్ లోనే పని చేయాలి అనే నిబంధన ఉన్నదని, అనేక మంది విద్యార్థులు వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి క్యాంపస్ వెళ్లిపోయారని, పరిస్థితి చాలా ఆందోళన కరంగా ఉందని, భయభ్రాంతులను చేసే వాతావరణం ఉందని, తల్లిదండ్రులకు ఫోన్ చేసి మేమే వెనక్కి వచ్చేస్తున్నాం అనే ప్రక్రియ నడుస్తోందని అనేక వార్తా కధనాలు వచ్చాయి. ఈ సమయం లో నే న్యూ జెర్సీ ఏరియా లో సాయి కుమార్ రెడ్డి అనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఆందోళన పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని అనుకోవడం మొదలెట్టారు.
ఈ రెండు సంఘటనలు గడిచిన వెంటనే అన్ని దేశాలతో పాటు భారత దేశానికి కూడా అక్రమ వలసదారులు (Illegal migrants) ని వెనక్కి పంపిస్తూ ఒక యుద్ధ విమానం పంజాబ్ రాష్ట్రము లోని అమృతసర్ చేరిందని తెలుసుకొని, ఇండియా లో వార్తా సంస్థలు, వార్తా ఛానళ్లు అనేక వార్తా కధనాలు విడుదల / ప్రసారం చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నేను కూడా నాలుగైదు సార్లు టీవీ డిబేట్ లలో పాల్గొన్నాను కూడా. నాతోపాటు ఇతర ఫైనలిస్టు కూడా చెప్పిన విషయాలు మరొక్కసారి గుర్తు చేసుకుందాం.
అమెరికా గవర్నమెంట్, అమెరికా మీడియా చెబుతున్న మాట ఇల్లీగల్ మైగ్రంట్స్ (అక్రమ వలసదారులు) : వీరందరూ చాలా రోజుల ముందే పట్టుబడి డిపోర్టాషన్ సెంటర్ లో గాని, జైళ్లలో గాని ఉన్న వారిని వెనక్కి పంపిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి శ్రీ జయశంకర్ ట్రంప్ ప్రమాణ స్వీకార మహోత్సవం వెళ్ళినప్పుడు ఇప్పటికే గుర్తించిన 18 వేల మంది భారతీయ అక్రమ వలసదారులను మేము వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా కూడా ట్రంప్ ప్రభుత్వం మొదటి విడత గా 104 మందిని అమృత్సర్ పంపించింది. మరో 494 మంది పంపించబోతున్నామని అని ప్రకటించింది కూడా. వీటిలో కూడా ఈ మధ్యనే పట్టుబడిన లేదా గత ఇరవై రోజుల్లో పట్టుబడిన స్టూడెంట్స్ లేరనే అనుకోవాలి.
అలాగే ఒక్కసారిగా చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్ళిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి అని ఆందోళన పడుతున్న విషయంలో కూడా మనం Covid రోజులు గుర్తు చేసుకోవాలి. ఈ స్టూడెంట్స్ అందరూ Covid సమయంలో 15 నుంచి 24 నెలల వరకు ఎలాంటి ఉద్యోగం లేకుండా గడప గలిగారు. వారికి వారి స్నేహితులు కావచ్చు, తెలుగు గ్రూప్ లు కావచ్చు, తెలుగు సంఘాలు కావచ్చు, తెలుగు పెద్దలు కావచ్చు అనేక మంది అనేక విధాల సహాయ పడ్డారు అందువల్ల ఆ విషయం గురించి కూడా పడవలసిన ఆందోళన కంటే ఎక్కువగా ఆందోళన పడకూడదు అని తల్లిదండ్రులను కోరుతున్నాం.
ఈ నేపథ్యంలో విశ్వ గురు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటన కి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రధాని గా ఆయన అనేక విషయాలు అమెరికా అధ్యక్షుని తో చర్చిస్తారని అందరికి తెలుసు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ సెక్యూరిటీ, Indo-China సెక్యూరిటీ లాంటి సెక్యూరిటీ సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అలాగే అనేక వాణిజ్య పరమైన విషయాలు ఉంటాయి అని కూడా తెలుసు. వీటన్నిటి కంటే మించిన మిక్కిలి సెన్సిటివ్ విషయాలు ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద ఏమి చర్చించ బోతున్నారు? మోడీ ప్రతిపాదనలకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు లాంటి విషయాలపై పెద్ద ఉత్కంఠ నెలకొని ఉన్నది.
ఇంతకుముందు భారతదేశం నుండి ఏ ప్రధాని చేయనటువంటి స్నేహం మోడీ వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్ కు అందించారు. అమెరికా ఎన్నికల ముందే రాబోయేది ట్రంపు ప్రభుత్వమే అని మీటింగ్ లో చెప్పారు. 2016-20 పీరియడ్ లో అధికార హోదాలో ట్రంపు ని ఇండియా పిలిచి ఢిల్లీ నుండి గుజరాత్ వరకు తిప్పి భారతదేశం ప్రాముఖ్యతను వివరించారు.
అయితే అంత స్నేహ భావం ఉన్నా ప్రధాని మోడీ లేదా మోడీ ప్రభుత్వం ఇండియా కి వెనక్కి పంపిన వలసదారుల విషయం మీద ఒక్క మాట మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఇంకా పైగా రాజ్యసభలో విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ వలసదారుల ని వెనక్కి పంపే ప్రక్రియ 2009 నుంచి జరుగుతోందని, ఇప్పటికే దాదాపు పదిహేను వేల మంది వలసదారులను వెనక్కి పంపారని, సంకెళ్ళు వేసి పంపడం అనేది 2012లోనే అమెరికా ప్రభుత్వం తీసుకున్న సేఫ్టీ నిర్ణయాల లో ఒక భాగమని తేల్చి చెప్పేశారు మోడీ ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడటం తప్పని ప్రతిపక్ష వర్గాలు మాత్రమే కాకుండా అనేక మంది మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీ నరేంద్ర మోడీ తన అత్యున్నత రాజకీయ చతురత, కొన్ని వందల సమస్యలు పరిష్కరించిన అనుభవం ఉపయోగపడుతుంది అని, ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ విషయాల పై సానుకూల ధోరణి ప్రదర్శించేలా చేయగలరని అందరూ ఆశిస్తున్నారు.
ఈ సమయంలో మన గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ట్రంప్ కి అత్యంత స్నేహితుడైన ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వచ్చి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ( ICC ) తనను దోషిగా నిర్ణయించిందని, తనను అరెస్టు చేయాలని ప్రకటించింది అని డొనాల్డ్ ట్రంప్ కి చెప్పగానే, ట్రంప్ ఐసీసీ మీద మంది పడ్డారు. అప్పటికప్పుడే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకటించి ఐసీసీ ని బెదిరించారు. అంటే నెతన్యాహు స్నేహితుడిగా ట్రంప్ నుంచి తనకు కావాల్సిన పని చేయించుకున్నారు. కాబట్టి మన ప్రధాని మోడీ – ట్రంప్ చర్చలు తరువాత కొన్ని విషయాల్లో ట్రంప్ మెత్తబడి వస్తారని ఆశిద్దాం.
కొలంబియా లాంటి చిన్న దేశం కూడా యుద్ధ విమానాల లో వలసదారులను పంపే పని ని ప్రతిఘటించి, అమెరికా యుద్ధ విమానాలను వెనక్కి పంపేసి, తమ దేశం నుంచి ఒక పౌర విమానం పంపి తమ దేశస్తుల వెనక్కి తెచ్చుకోంది. వాణిజ్యంలో, మేధో వనరులలో అగ్ర దేశాలతో పోటీ పడుతున్న భారతదేశం ఇంత మాత్రం కూడా చేయకపోవడం ఇంకా పైగా వలసదారులను పంపే చర్యలను సమర్థించడం చాలా తప్పుగా అందరూ అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మోడీ – ట్రంప్ సమావేశాలలో సెక్యూరిటీ వ్యవహారాలు, వాణిజ్య వ్యవహారాల తో పాటు సున్నితమైన ఇమ్మిగ్రేషన్ మీద మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. భారత మేధోశక్తి అమెరికా కు అవసరం అని చెప్పి స్టూడెంట్ వీసా ల గురించి, H1 వీసాల గురించి మాట్లాడుతారు అని ఆశిద్దాం. అలాగే ప్రస్తుతం భారత దేశం దాదాపు 600 బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తోందని గుర్తు చేస్తూ మన దేశం మీద అధిక పన్నులు, సుంకాలు లేకుండా చూస్తారని ఆశిద్దాం.
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్, తెలుగుటైమ్స్







