భారత్ ఫస్ట్ అంటున్న మాల్దీవులు.. అంతలో ఇంత తేడా ఎలా సాధ్యమైంది..?
భారత్ వ్యతిరేకతతో ఎన్నికల్లో గెలిచారు. తాను అనుకున్నట్లుగానే భారత్ ను దూరం చేసుకోవాలని ప్రయత్నించారు. చైనా ఫస్ట్ అన్నట్లుగా వ్యవహరించారు. ఆదేశంలో పర్యటించి.. పలు ఒప్పందాలు చేసుకున్నారు. కానీ.. భారత్ తమకు దూరమైతే ఎంత సమస్య వస్తుందో అర్థం చేసుకోలేకపోయారు. అయితే … మాల్దీవులకు భారతీయులు గట్టిగానే రిటర్న్ గిఫ్టిచ్చారు. మాల్దీవులు బాయ్ కాట్ నినాదంతో.. ఆ దేశ పర్యాటక రంగంపై గట్టిదెబ్బ కొట్టారు. భారతీయుల స్థానాన్ని వేరెవరు భర్తీ చేయలేరన్న సంగతి అర్థమయ్యేసరికి ఆలస్యం జరిగిపోయింది. పర్యాటక రంగం కుదేలయ్యేసరికి… దేశం దివాలా అంచుకు చేరింది. దీంతో మళ్లీ భారత్ ఫస్ట్ అంటూ ముందుకొచ్చారు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు.
ఐదు రోజుల భారత్ పర్యటనలో భాగంగా మాల్దీవ్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ..ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. మొదటిరోజు ఇరు దేశాల అధినేతలు పలు విషయాలపై చర్చించుకున్నారు. మాల్దీవులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండంగా ఇండియా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మాల్దీవుల సంక్షోభ సమయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని మోడీ తెలిపారు. మాల్దీవులకు రూ.30 బిలియన్స్ ఇండియన్ కరెన్సీ ఆర్థిక సాయంగా ఇవ్వనున్నామన్నారు. ఇరు దేశాల మధ్య హైదరాబాద్ హౌస్లో సముద్ర భద్రత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
భారతదేశ 'నైబర్హుడ్ ఫస్ట్' విధానం, సాగర్ విజన్లో మాల్దీవుల కీలక పాత్రను ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్, మాల్దీవుల సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇండియా మాల్దీవులకు సన్నిహిత మిత్ర దేశమని ప్రధాని మోడీ అన్నారు. మా నైబర్ హుడ్ విధానం, సాగర్ దృష్టిలో మాల్దీవులు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందని.. ఇండియా ఫస్ట్ ప్రిఫెరెన్స్ ఎప్పుడు మాల్దీవులకే అని ఆయన అన్నారు. 400 మిలియన్ యుఎస్ డాలర్ల ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్ ఒప్పందానికి అదనంగా 30 బిలియన్ ఇండియన్ కరెన్సీ ఇచ్చినందుకు ముయిజ్జూ కృతజ్ఞతలు తెలిపారు.






