ఇమ్రాన్ ఖాన్ కు భారీ విజయం
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. రిజర్వుడు సీట్లకు ఆయన పార్టీ.. పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) అర్హురాలని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాజీ ఫైజ్ ఈసా నేతృత్వంలోని 13మంది సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఇమ్రాన్ మద్దతుదారులు పార్లమెంటు, ప్రొవిన్షియల్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. వీరిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా చూడాలని ప్రయత్నిస్తున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణకూటమికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.
ప్రొవిన్షియల్ అసెంబ్లీల్లో ఇమ్రాన్ పార్టీకి రిజర్వుడు సీట్లు కేటాయించకూడదంటూ పాకిస్థాన్ ఎన్నికల కమిషన్(ఈసీపీ) తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సున్నీ ఇత్తిహాద్ కౌన్సిల్ (ఎస్ఐసీ) వేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గుర్తు బ్యాట్‌పై ఈసీపీ నిషేధం విధించడంతో ఎన్నికల్లో పోటీచేసే అర్హతను పీటీఐ కోల్పోయింది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గారు. అనంతరం ఎస్ఐసీ పార్టీలోకి చేరి కూటమిగా ఏర్పడ్డారు.
అయితే పార్లమెంటు, ప్రొవిన్షియల్ అసెంబ్లీల్లో దామాషా పద్దతిలో పార్టీలకు విధిగా ఇవ్వాల్సిన రిజర్వుడు సీట్లను ఎస్ఐసీకి కేటాయించలేదు. ఇందుకు ఎస్ఐసీకి అర్హత లేదని ఈసీపీ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈసీ నిర్ణయంపై ఇమ్రాన్ మద్దతుదారులు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. ఇక పార్లమెంటు, ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఇమ్రాన్ మద్దతుదారులు అడుగు పెట్టడం వల్ల.. పాక్ సర్కార్ కు పెను సమస్యలు తప్పవని తెలుస్తోంది.






