Mamdani: వెనెజువెలాపై దాడి యుద్ధచర్యే.. ట్రంప్ నకు నిరసన తెలిపిన మమ్దానీ..!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా సైన్యం అరెస్ట్ చేయడం.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వివిధ దేశాలు వాటికి అమెరికాతో ఉన్న సంబంధాలను బట్టి స్పందిస్తున్నాయి. ముఖ్యంగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో సన్నిహిత సంబంధాలున్నా రష్యా, చైనా, క్యూబా లాంటి దేశాలు.. ఈ నిర్ణయం ఆక్రమణగా అభివర్ణించాయి. వేరే దేశాల సంగతి పక్కన పెడితే అమెరికా చట్టసభ సభ్యులు దీన్ని తీవ్రంగా నిరసించారు. న్యూయార్క్ కొత్తమేయర్ మమ్దానీ సైతం.. ఇది యుద్ధ చర్య కిందకే వస్తుందన్నారు. తన నిరసనను ట్రంప్ కు ఫోన్ చేసి మరీ వెల్లడించానన్నారు మమ్దానీ.
నార్కో-టెర్రరిజం, మాదకద్రవ్యాల సరఫరా, ఆయుధాల వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలపై నికోలస్ మదురో దంపతులపై న్యూయార్క్‌లో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం వారిని అమెరికా సైన్యం ప్రత్యేక ఆపరేషన్ ద్వారా బంధించి న్యూయార్క్‌కు తరలిస్తోంది. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా మేయర్ మమ్దానీ మాట్లాడుతూ… “ఈ చర్య కేవలం విదేశాలకే పరిమితం కాదు. న్యూయార్క్‌లో నివసిస్తున్న వేలాది మంది వెనిజులా పౌరులతో సహా అందరిపైనా ప్రభావం చూపుతుంది. వారి భద్రతే నాకు ముఖ్యం” అని పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా అటార్నీ జనరల్ పమేలా బాండీ స్పందిస్తూ.. మదురో దంపతులను త్వరలోనే అమెరికా న్యాయవ్యవస్థ ముందుకు తీసుకువస్తారని, ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు ట్రంప్‌కు, సైన్యానికి ధన్యవాదాలని తెలిపారు.
అయితే, ఈ సైనిక చర్యను కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తప్పుబట్టారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా సైనిక శక్తిని ప్రయోగించడం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. ఇలాంటి చర్యలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసి, దేశ భద్రతకే ముప్పు కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.






