నేపాల్ లో నూతన ప్రధానిగా కె.పి.శర్మ ఓలి ..
నేపాల్ రాజకీయ సంక్షోభంలో మరో అంకానికి తెరలేచింది.ఊహించినట్లుగానే నేపాల్ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ సెంటర్(సీపీఎన్-ఎంసీ) అధినేత పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 ఓట్లు కావాల్సి ఉండగా, ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్(సీపీఎన్-యూఎంఎల్), మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)ల కూటమి సన్నద్ధమైంది. సీపీఎన్-యూఎంఎల్‌కు 78 మంది, ఎన్సీకి 89 మంది సభ్యుల బలం ఉంది. తాను ప్రధాని పదవి చేపట్టనున్నట్లు ఓలి ప్రకటించారు. ఆదివారం సాయంత్రంలోపు తమ బలాన్ని నిరూపించుకోవాలని దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కూటమికి సూచించారు.
మరోవైపు కొన్ని రోజుల క్రితమే ఓలి, దేవ్బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసేవరకూ దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు. 2024-25 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌పై అసంతృప్తితోనే ప్రచండ సర్కార్ కు ఓలి మద్దతు ఉపసంహరించారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఓలి పార్టీ మంత్రులు సైతం రాజీనామా చేశారు.ప్రచండ సంకీర్ణ సర్కార్ కూలిపోయిన తరవాత తాము ఏర్పాటుచేసే కొత్త జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని సవరించాలని దేవ్ బా, ఓలి నిర్ణయించారు.






