Los Angels: అమెరికాను చుట్టేస్తున్న యాంటీ ఐస్ ఆందోళనలు…

అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ICE) అధికారుల చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్ (Los Angeles) లో మొదలైన ఆందోళనలు మెల్లగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డల్లాస్, లూయిస్‌విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో తదితర ప్రదేశాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.శాన్ ఫ్రాన్సిస్కోలో 150 మందిని అరెస్టు చేయగా.. న్యూయార్క్‌లో కూడా పలువురిని అదుపులోకి తీసుకొన్నట్లు అధికారులు తెలిపారు..శాన్ ఫ్రాన్సిస్కో సివిక్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి వేల మంది ప్రదర్శన నిర్వహించారు. వారు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రైడ్స్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
అరెస్టులతోనే అసలు సమస్య..
రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలంటూ ట్రంప్ కార్యవర్గం ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం లాస్ ఏంజెలెస్ నగరంలో లాటిన్ ప్రజలు అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ఐసీఈ అధికారులు దాడులు మొదలుపెట్టారు. ఇక్కడ దక్షిణ లాస్ ఏంజెలెస్‌లో దాదాపు 82శాతం మంది హిస్పానిక్ ప్రజలే ఉంటారు. అక్కడ జరిగిన ఒక్క ఆపరేషన్‌లోనే 44 మంది అక్రమ వలసదారులను ఐసీఈ అధికారులు అరెస్టు చేశారు. ఇక గ్రేటర్ లాస్ ఏంజెలెస్‌లో జరిగిన కార్యక్రమంలో డజన్ల కొద్దీ అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొన్నట్లు అధికారులు ఎక్స్‌లో పోస్టు చేశారు.
నాటి నుంచి లాస్ ఏంజెలెస్, పారామౌంట్, కాప్టొన్ ప్రాంతాల్లో యాంటీ ఐస్ ఆందోళనలు మొదలయ్యాయి. డెటెన్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. అదే సమయంలో ట్రంప్ 2,000 మంది నేషనల్ గార్డ్‌లను మోహరిస్తానని ప్రకటించడం.. సమస్యను మరింత తీవ్రం చేసింది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ నేషనల్ గార్డ్స్ అవసరం లేదని తేల్చిచెప్పారు. కానీ, ట్రంప్ వినలేదు. తాజాగా 700 మంది మెరైన్లు, అదనంగా మరో 2,000 మంది నేషనల్ గార్డ్‌లను కూడా మోహరించాలని నిర్ణయించారు.
వాస్తవానికి అమెరికాలో నేషనల్ గార్డ్ అనేది ఓ హైబ్రీడ్ విభాగం. ఇది రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. గవర్నర్ ఆదేశాలతో రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దించుతారు. కానీ, ఈసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకున్న అరుదైన అధికారాలను వినియోగించి వీరిని లాస్ ఏంజెలెస్‌లో మోహరించారు. 1965 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.