ట్రూడో పదవి నుంచి దిగిపో….స్వపక్ష ఎంపీల అల్టిమేటమ్…!
ఎన్నికల సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు గట్టి ఝలక్ తగిలింది. అదీ స్వపక్ష ఎంపీల నుంచే ఎదురైంది. అక్టోబర్ 28లోపు ప్రధాని పదవి నుంచి ట్రూడో తప్పుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అధికార లిబరల్ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు.జస్టిన్ ట్రూడో నాలుగో సారి పోటీ చేయొద్దని కూడా వారు కోరినట్లు సమాచారం. కాగా, వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన మంత్రిగా జస్టిన్ ట్రూడో ప్రజల మాటను ఇప్పటినుంచైనా వినాలని మరి కొందరు ఎంపీలు కోరారు.
ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. ఎంపీలు నిజంగా ప్రధానికి సత్యాలే చెబుతున్నారా? ఆ సత్యాలను వినాలని భావించే ఉద్దేశం జస్టిన్ ట్రూడోకి ఉందా? అని క్వశ్చన్ చేశారు. ఈ సందర్భంగా లిబరల్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో పాటు 20 మంది సభ్యులతో కలిసి వచ్చే ఎన్నికలలోపు ప్రధాని జస్టిన్ ట్రూడో వైదొలగాలని కోరుతూ లేఖపై సంతకం చేశామని వెల్లడించారు. లిబరల్ పార్టీలోని 153 మంది సభ్యులలో 24 మంది జస్టిన్ ట్రూడో రాజీనామా కోరుతూ లేఖపై సంతకం చేసినట్లు కెనడియన్ మీడియా చెబుతోంది. మిగతా శాసనసభ్యుల్లో చాలా మంది జస్టిన్ ట్రూడోకి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ ఆయన ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు.
ట్రూడో మాత్రం తమ పార్టీ ఐక్యంగా ఉందని చెప్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీని తానే నడిపిస్తానని వెల్లడించారు. అయితే, అక్టోబరు 15న విడుదలైన నానోస్ రీసెర్చ్ పోల్ కన్జర్వేటివ్‌లకు 39 శాతం ప్రజలు మద్దతునిచ్చారు.. లిబరల్స్‌కు 23 శాతం, ప్రత్యర్థి లెఫ్ట్-లీనింగ్ న్యూ డెమోక్రాట్లకు 21 శాతం మద్దతు లభించింది. ఎన్నికల రోజున కూడా ఇలాంటి ఫలితం కన్జర్వేటివ్‌లకు అనుకూలంగా ఉంటుందని పలు సర్వేలు వెల్లడించాయి.






