Pakistan: ఉగ్రవాదులకు డిజిటల్ అండ.. జైషే కోసం పాక్ సర్కార్ హవాలా రూట్..

ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాక్ కు దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది.తమంత తాముగా భారత్ ను ఏమీ చేయలేమన్న క్లారిటీ రావడంతో.. అమెరికాతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించింది. అయితే దీనికి అమెరికా అనుగ్రహం కావాలి. ఇందుకు ట్రంప్ రూట్ ఎంచుకుంది. దీనిలో భాగంగా పాక్ సైనికాధిపతి మునీర్ .. ఇటీవలి కాలంలోరెండుసార్లు ట్రంప్ తో సమావేశమయ్యారు. ఏకంగా ట్రంప్ కు పాక్ సర్కార్.. నోబెల్ బహుమతి ఇవ్వాలాంటూ నామినేట్ చేసింది కూడా.
ఇంకేముంది ఎప్పుడైతే అమెరికాతో సఖ్యత కుదిరిందో పాక్ అప్పుడే తన ముసుగు తీసేసింది.నిర్భయంగా ఉగ్ర పాములను పెంచి పోషిస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్(FATF)కు కూడా భయపడకుండా జైషే మహమ్మద్ సంస్థ తన నెట్‌వర్క్‌కు ఓ కొత్తరకం హవాలా మార్గంలో డబ్బులు పంపుతున్నట్లు తేలింది. దీంతో ఉగ్ర విద్యార్థులకు శిక్షణ, భారత్ దాడుల్లో దెబ్బతిన్న క్యాంపస్‌ల పునరుద్ధరణకు పాల్పడుతూ కార్యకలాపాలను విస్తరిస్తోంది.
ఆంక్షల ముప్పును తప్పించుకుంటూనే టెర్రరిజాన్ని పెంచే పనిలో పడింది పాకిస్థాన్(pakistan). వాస్తవానికి ఎఫ్‌ఏటీఎఫ్ గ్రేలిస్టు నుంచి బయటపడేందుకు 2019లో పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్‌ను అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం జైషేకు నిధులు అందకుండా మర్కజ్, మసూద్ అజర్, రవూఫ్ అస్ఘర్, తాల్హఅల్ షఫీల బ్యాంక్ ఖాతాలను నియంత్రిస్తున్నట్లు ప్రకటించింది. వారు నిధులు బదిలీ చేయకుండా ఆంక్షలు విధించామని చెప్పుకొంది. దీంతో ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ, జైషే కలిసి నిధుల కోసం కొత్త మార్గాన్ని తెరిచాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్థానీ (pakistan) డిజిటల్ వాలెట్లు ఈజీపైసా, సదాపే వంటి వాటిని వాడటం మొదలుపెట్టాయి.
మరోవైపు జైషే కూడా వీటికోసం ఆన్‌లైన్‌లో నిధులను సమీకరించే పనిలో పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈజీపైసా అనే వాలెట్ ద్వారా 391 కోట్ల పాకిస్థానీ (pakistan) రూపాయిలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. పాక్ మొత్తం మీద 313 ఉగ్ర శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఈ సొమ్మును వినియోగించనుంది. వస్తున్న చందాల మొత్తాన్ని మసూద్ అజార్ కుటుంబం నియంత్రిస్తున్న వాలెట్లకు మళ్లిస్తున్నారు. దీంతో జైషేకు నిధులను ఆపేశామని పాక్ ఎఫ్‌ఏటీఎఫ్ వద్ద చెప్పుకొనే అవకాశం కలుగుతోంది.
మరోవైపు…నిధుల సమీకరణ కోసం జైషే తన కేడర్‌ను రంగంలోకి దించింది. వారు పోస్టర్లు, వీడియోలు, మసూద్ అజార్ పేరిట లేఖలను ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తున్నారు. దీనిలో జైషే 313 కొత్త మర్కజ్‌లు నిర్మిస్తోందని.. ఒక్కో దానికి 1.25 కోట్ల పాకిస్థానీ రూపాయలు అవసరమని సానుభూతిపరులను కోరినట్లు గుర్తించారు.
మసూద్ అజార్ కుటుంబం 7-8 డిజిటల్ వాలెట్లను నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వాటిని ప్రతి 3 లేదా 4 నెలలకు మార్చేస్తున్నారు. వాటిల్లోని భారీ మొత్తాలను కొత్త ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. తొలుత ఓ ఖాతాలోకి భారీ మొత్తాన్ని చేర్చి.. అక్కడి నుంచి నిధులు డ్రా చేయడం కోసం 10 నుంచి 15 ఖాతాలకు చిన్న మొత్తాల్లో పంపిస్తున్నారు. జైషే సగటున నెలకు 30 కొత్త వాలెట్లను యాక్టివేట్ చేస్తుండటంతో.. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎటు వెళ్లాయో గుర్తించడం ఇబ్బందికరంగా మారింది. ఆ సంస్థ 80 శాతం నిధులు వీటి ద్వారానే వస్తున్నాయి.