Iran Economy Collapse: ఇరాన్ ఆందోళనలకు కారణమేంటి..?
గల్ఫ్ దేశాల్లో మొండిఘటంగా చెప్పుకునే ఇరాన్.. ఇప్పుడుతీవ్ర సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో బాధపడుతున్నారు. మండిపోతున్న నిత్యవసరాలు.. వారిని మరింతబాధపెడుతున్నాయి. నలబై ఏళ్ల నుంచి తమ బతుకులు దుర్భరంగా మారిపోయాయని అక్కడి మహిళలు వాపోతున్నారు. మాకొద్దీ పాలన.. మాకొద్దీ బానిసత్వం అంటూ యువత , మహిళలు.. ఆందోళనలు, నిరసనలకు దిగారు. అదిప్పుడు కార్చిచ్చులా వ్యాపించి.. ఇరాన్ అంతటా మండిపోతోంది
చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దేశ కరెన్సీ రియాల్ విలువ పతనం ఆగడం లేదు. దీంతో ప్రజలు పెరిగిన నిత్యావసర ధరతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక డాలర్ విలువ ఇరాన్లో 14 లక్షల రియాల్‌కు చేరింది. దీంతో సామాన్యులు రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. భారత రూపాయితో పోల్చితే, కేవలం రూ.90తో 14 లక్షల రియాల్స్ పొందవచ్చు. గత డిసెంబర్లో సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు మొహమ్మద్ రెజా ఫార్జిన్ రాజీనామా చేశారు.
యుద్ధాలు, ఆంక్షలు..
గత జూన్‌లో ఇజ్రాయిల్‌తో ప్రారంభమైన యుద్ధం ఇరాన్ పతనాన్ని వేగవంతం చేసింది. అమెరికా న్యూక్లియర్ సైట్లపై దాడులు, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఆర్థికాన్ని కుంగదీశాయి. ట్రంప్ పాలసీలు..ఇరాన్ ఆయిల్ ఎగుమతులకు ఆటంకంగా మారాయి., విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటాయి. దీంతో సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయి.
40 ఏళ్లలో 20 వేల రెట్లు పతనం..
1979 విప్లవ సమయంలో డాలర్ విలువ 70 రియాల్స్‌కు సమానంగా ఉండేది. 2026 ప్రారంభంలో 14 లక్షలకు చేరింది. 40 ఏళ్లలో విలువ 20,000 రెట్లు పడిపోయింది. 2025లో మాత్రమే 45 శాతం క్షీణత సంభవించింది. బ్యాంక్ డబ్బులు కరిగిపోతాయని భయపడి పౌరులు డాలర్లు, బంగారు కొనుగోళ్లకు దిగుతున్నారు.
డిసెంబర్లో తెహ్రాన్ గ్రాండ్ బజార్ వ్యాపారులు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడ్డారు. రియాల్ పతనంతో రుణాలు పెరిగి, విద్యార్థులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జొమ్హౌరి అవెన్యూలో ప్రారంభమైన ఇది ఇప్పుడు అయతోల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్‌పై పోరుగా మారింది.






