Digital ID Card: డిజిటల్ ఐడీ తప్పనిసరి కాదు.. కీర్ స్టార్మర్ యూటర్న్..?
వలసలతో యూరోప్ దేశాలు అల్లాడుతున్నాయి వెల్లువెత్తిన వలసలను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది బ్రిటన్. దీంతో భారత్ తరహాలో డిజిటల్ ఐడీ తీసుకురావాలని ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకు గానూ.. ఇండియా వచ్చిన సమయంలో కీర్.. ఆధార్ పై ఆసక్తి చూపించారు. నిలేకనితో సమావేశమయ్యారు కూడా. కానీ బ్రిటన్ వెళ్లిన తర్వాత ఇబ్బందులు తప్పలేదు. దీంతో కీర్ సర్కార్ వెనక్కు తగ్గింది. యూటర్న్ తీసుకుంది.
డిజిటల్ ఐడీలు (Digital ID) దోహదపడతాయని భావించిన బ్రిటన్.. తాజాగా ఈ ప్రణాళికపై వెనక్కి తగ్గింది. దేశంలో ఉద్యోగం పొందడానికి డిజిటల్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది. ఈ విధానంపై ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నుంచీ విమర్శలు రావడంతో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) దీనిపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
బ్రిటన్ పౌరులు, నివాసితులు దేశంలో పనిచేయాలంటే డిజిటల్ ఐడీ కార్డులు ఉండాలని ప్రధాని కీర్ స్టార్మర్ గతంలో స్పష్టం చేశారు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించడంలో దోహదపడుతుందని గత సెప్టెంబర్లో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం, చిన్నారుల రక్షణతోపాటు ప్రభుత్వ సర్వీసులను మరింత సులభతరం చేస్తుందన్నారు. ఈ క్రమంలో భారత్లోని ‘ఆధార్’ వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు స్టార్మర్ ఆసక్తి చూపారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామాన్య పౌరులకు ఈ తరహా డిజిటల్ ఐడీ కార్డులను బ్రిటన్ తప్పనిసరి చేయలేదు. ఈ అంశం దశాబ్దాలుగా వివాదాస్పదంగానే ఉంది. మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా వీటిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. ఉగ్రవాదంపై పోరు, మోసాలను నియంత్రించడానికి ఇదో మార్గమని అప్పట్లో ఆయన చెప్పారు. కానీ, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడంతోపాటు వారి సమాచారానికి ముప్పు ఏర్పడుతుందని పౌర హక్కుల కార్యకర్తల వాదనతో ఆయా ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయి.






