Delhi: సమస్యల పరిష్కారం ఇండో-చైనా ఫోకస్…

భారత్‌కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్ధమైన చైనా..!
వ్యాపార సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడంపై ఇండియా- చైనా ఫోకస్ పెట్టాయి. గతంలో ఇండియాతో బౌగోళిక వైరాన్ని కొనసాగిస్తూ వచ్చిన చైనా.. ఇప్పుడు ఆ వైరాన్ని పక్కన పెట్టి వ్యాపార బంధం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ట్రంప్ వాణిజ్యయుద్దంతో రాబోయే పరిస్థితులను చక్కదిద్దుకునే దిశగా అడుగులేస్తోంది. ఈక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ (Wang Yi) పర్యటన సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన మన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. భారత్‌కు ఎరువులు, బోరింగ్ యంత్ర పరికరాలు, రేర్‌ఎర్త్ మినరల్స్ సరఫరా చేసేందుకు బీజింగ్ సిద్ధమైంది. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
యూరియా, ఎన్‌పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు, టీబీఎం సరఫరాల్లో సమస్యలను గత చైనా (China) పర్యటనలో వాంగ్‌యీ వద్ద జైశంకర్ ప్రస్తావించారు. తైవాన్ విషయంలో భారత వైఖరిలో ఎటువంటి మార్పులు లేవని వాంగ్‌యీకి వెల్లడించినట్లు జైశంకర్ పేర్కొన్నారు. తైపిలో కేవలం ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు నిర్వహించేందుకు మాత్రమే అక్కడ తమ ప్రతినిధులు ఉంటారని చెప్పారు. మరోవైపు చైనా ఎరువులు, టీబీఎం, రేర్‌ఎర్త్ మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించడంతో తాజాగా జరిగిన ఈ భేటీ కీలక పరిణామంగా నిలిచింది.
చైనా (China) నుంచి భారత్‌కు కొన్ని నెలలుగా ప్రత్యేక ఎరువుల ఎగుమతి నిలిచిపోయింది. మరోవైపు బీజింగ్ ఇతరదేశాలకు మాత్రం వీటిని సరఫరా చేస్తూ వస్తోంది. ఈ రకం ఎరువులను ఎగుమతి చేయాలంటే ఆ ఫ్యాక్టరీ షిప్‌మెంట్లను చైనా అధికారులు తనిఖీలు చేయాలి. ఈనేపథ్యంలో భారత్‌కు పంపే షిప్‌మెంట్స్‌ను వారు తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పష్టమైన నిషేధం ఏదీ విధించకుండానే.. ఎగుమతులను అడ్డుకొనేందుకు బీజింగ్ ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం..
మొక్కలు, చెట్లకు భూవాతావరణ పరిస్థితుల ఆధారంగా కొన్నిరకాల పోషకాలను అందించి ఫలసాయం సాధించేందుకు తయారుచేసిన వాటిని ప్రత్యేకమైన ఎరువులుగా వ్యవహరిస్తారు. వీటిల్లో పలు రకాలు ఉంటాయి. ఈ రకం ఎరువులను పెద్దఎత్తున తయారుచేసుకొనే సామర్థ్యం భారత్‌కు లేదు. చిన్న మొత్తాల్లో స్థానికంగా తయారుచేస్తుంటారు. కానీ, ఆర్థికంగా ఇవి వారికి లాభదాయకం కాదు. భారత్ వినియోగించే వాటిల్లో 80శాతం దిగుమతి అయ్యేవి చైనా నుంచే. నాలుగైదేళ్లుగా భారత్‌కు ఈ సరఫరాలను చైనా నియంత్రిస్తోంది. 2023లో భారత్‌కు రావాల్సిన యూరియాను కూడా చైనాకు చెందిన రెండు బడా సంస్థలు నిలిపివేశాయి. ఇటీవల జూన్‌లో నిబంధనలు కొంత సడలించినా.. తాజా భేటీతో ఎరువుల సరఫరాకు మార్గం సుగమం అయింది.