మెక్సికన్ల తర్వాత భారతీయులే…
అమెరికా పౌరసత్వం చాలా మందికి ఆశాదీపం. లక్షలాది మంది అమెరికన్ పౌరసత్వం పొందాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో అత్యధికంగా మెక్సికన్లు.. అమెరికన్ పౌరులుగా మారుతున్నారు. తర్వాతి స్థానంలో భారతీయులు నిలుస్తున్నారు. 2022లో అమెరికా పౌరసత్వం పొందిన వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు.
మెక్సికో తర్వాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందింది మనవారే. ఆ ఏడాదిలో 65,960 మందికి నేచురలైజేషన్ సిటిజన్ షిప్ లభించింది. అమెరికాలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. 33.3 కోట్ల అగ్రరాజ్య జనాభాలో ఇది 14 శాతానికి సమానం. వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము నేచురలైజ్డ్ సిటిజన్స్ గా భావిస్తున్నారు. మొత్తంగా ఆ ఏడాదిలో 9,69,380 మంది ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారారని స్వతంత్ర ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS)’ నివేదిక వెల్లడించింది.
2022లో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారారు. తర్వాత ఇండియా (65,960), ఫిలిప్పీన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికన్ రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) ఉన్నాయి. అయితే, భారత్లో పుట్టి అమెరికాలో ఉంటున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీఆర్ఎస్ నివేదిక తెలిపింది. 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ (LPR) ఉన్న 2,90,000 మంది భారతీయులు నేచురలైజేషన్ సిటిజన్ షిప్ పొందే అవకాశం ఉందని పేర్కొంది.
నేచురలైజేషన్ సిటిజన్ షిప్ కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య 2023 ముగిసే నాటికి 4,08,000గా ఉన్నట్లు సీఆర్ఎస్ నివేదిక తెలిపింది. 2023లో కొత్తగా 8,23,702 మంది ఎల్పీఆర్ ఉన్నవారు నేచురలైజేషన్ కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 90 లక్షల మంది వరకు దానికి అర్హత ఉన్నప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయని నివేదిక వెల్లడించింది.
నేచురలైజేషన్ సిటిజన్ షిప్ ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. జన్మించిన దేశంతో పాటు కనీసం ఐదేళ్ల పాటు ఎల్పీఆర్లు అయ్యి ఉండాలి. హోండురస్, గ్వాటిమాలా, వెనిజువెలా, ఎల్ సాల్వెడార్, బ్రెజిల్ దేశస్తులకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్థాన్ పౌరులకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.






