US: ప్రపంచంపై డాలర్ ఆధిపత్యం ఎలా సాధ్యమైంది….?
అమెరికా అగ్రరాజ్యాధిపత్యానికి 1974లోనే బీజం పడింది. డాలర్ ప్రాభవం పెరగాలంటే.. అది కేవలం చమురు అమ్మకాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించిన అమెరికా.. ఆదిశగా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి.. 1974లో, హెన్రీ కిస్సింజర్ సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో అతి ముఖ్యమైన అంశం…ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన అన్ని చమురు ధరలను US డాలర్లలో నిర్ణయించాలి. ప్రతిగా, అమెరికా సైనిక రక్షణను అందిస్తుంది.
ఈ ఒకే ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా డాలర్లకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించింది. భూమిపై ఉన్న ప్రతి దేశానికి చమురు కొనడానికి డాలర్లు అవసరం. ఇది అమెరికా అపరిమిత డబ్బును ముద్రించడానికి అనుమతిస్తుంది, ఇతర దేశాలు డాలర్ కోసం పని చేస్తాయి. ఇది సైన్యానికి నిధులు సమకూరుస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా.. వారిపై దాడులు తప్పవు. దీన్ని చరిత్ర నిరూపించింది కూడా.
2 వేల సంవత్సరంలో అప్పటి ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్… డాలర్ కు బదులుగా యూరోల్లో చమురు విక్రయిస్తామని ప్రకటించాడు. 2003 నాటికి అమెరికా ఇరాక్ పై ఆక్రమణకు దిగింది. సద్దాం హుస్సేన్ ను వెతికి, వెతికి మరీ హత్య చేశారు. ఫలితంగా చమురు వెంటనే డాలర్లకు తిరిగి మారింది.
2009లో లిబియా అధినేత కల్నల్ గడాఫీ.. డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. చమురు వ్యాపారం కోసం గడాఫీ “గోల్డ్ దినార్” ఆఫ్రికన్ కరెన్సీని ప్రతిపాదించాడు. అంతే అమెరికా రంగంలోకి దిగింది. 2011లో నాటో దళాలు లిబియాపై బాంబుదాడులు చేశాయి. గడాఫీని వేధించి, వేధించి మరీ హత్య చేశాయి. అతనితోపాటు ఆయన ఆలోచన అయిన బంగారు దినార్ కథ కంచికి చేరింది.
వెనెజువెలా అధినేతగా ఉన్న మదురో.. సద్దాం, గడాఫీ కన్నా ఐదురెట్టు చమురును యువాన్లలో అమ్మకాలు సాగించారు.అంతేకాదు.. డాలర్ కాకుండా ఇతర కరెన్సీతో చెల్లింపుల వ్యవస్థను రూపొందించేందుకు ప్రయత్నించారు. BRICSలో చేరాలని పిటిషన్ కూడా పెట్టుకున్నారు. అమెరికా బద్ధశత్రువులైన చైనా, రష్యా, ఇరాన్ తో భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డీ-డాలరైజేషన్ కు ఈ మూడు దేశాలే నాయకత్వం వహిస్తున్నాయి కూడా.






