సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురిబచ్ పై హిండెన్ బర్గ్ తాజా ఆరోపణలు

సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై, అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సవాలు విసిరింది. ‘హిండెన్‌బర్గ్ ఆరోపణలు, సెబీ విశ్వసనీయతపై దాడి అని, తమ వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం’ అంటూ మాధబి, ఆమె భర్త ధావల్ పేర్కొన్న గంటల వ్యవధిలోనే హిండెన్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసింది. బెర్ముడా/మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్లలో తనకు పెట్టుబడులు ఉన్నట్లు మాధబి ఒప్పుకొన్నారని, అదానీ సంస్థలో డైరెక్టరుగా ఉన్న తన భర్త బాల్యమిత్రుడు ఆ ఫండ్‌ను నిర్వహించినట్లు కూడా ధ్రువీకరించారని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఇవన్నీ చూస్తే కొన్ని కొత్త సందేహాలూ వస్తున్నాయని తెలిపింది.
హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలు..
‘భారత్, సింగపూర్‌లలో తాను ఏర్పాటు చేసిన రెండు కన్సల్టింగ్ కంపెనీల కార్యకలాపాలు.., 2017లో తాను సెబీలో ఆపేసినట్లు మాధబి స్వయంగా చెప్పారు. 2019లో వాటిని ఆమె భర్త టేకోవర్ చేశారని నమ్మబలికారు. తాజా వాటాదార్ల వివరాల ప్రకారం.. అగోరా అడ్వయిజరీ లిమిటెడ్ (ఇండియా)లో 2024 మార్చి 31 నాటికి మాధబి పురి బచ్‌కే 99% వాటా ఉంది. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తూ, ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అగోరా పార్ట్‌నర్స్ సింగపూర్‌లోనూ 2022 మార్చి 16 వరకు ఆమె 100% వాటాదారుగా ఉన్నారు. సెబీ పూర్తి కాల సభ్యురాలిగా ఉన్న సమయమంతా, ఆమె ఈ వాటా కలిగి ఉన్నారు. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన 2 వారాల తర్వాత, ఆ సంస్థలో తన వాటాను ఆమె తన భర్తకు బదిలీ చేశారు. అయితే సింగపూర్ సంస్థ తన లాభదాయ వివరాలను బహిర్గతం చేయని కారణంగా.. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలో మాధబి ఈ సంస్థ ద్వారా ఎంత ఆర్జించారో తెలుసుకోవడం కష్టమంది.
భారత సంస్థలో ఇప్పటికీ మాధబికి 99% వాటా ఉండగా.. ఆమె సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న (2021-22, 2022-23, 2023-24) సమయంలో ఈ సంస్థ రూ.2.40 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సెబీలో పూర్తి కాల సభ్యురాలిగా ఉన్న సమయంలోనే, మాధబి తన వ్యక్తిగత ఇ-మెయిల్ ఉపయోగించి తన భర్త పేరు మీద వ్యాపారం నిర్వహించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పుడు ఆమె అధికారిక హోదాలో ఉంటూ మరేదైనా ఇతర వ్యాపారాలను తన భర్త పేరు మీద నిర్వహించారా? అనే సందేహాన్ని ఇది రేకెత్తిస్తోంది. ఈ అంశాలన్నింటిపై పారదర్శక దర్యాప్తునకు మాధబి సిద్ధపడాలి, ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి’ అని హిండెన్‌బర్గ్ సూచించింది.
మాధబికి రీట్స్ సంఘం మద్దతు
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌కు స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్), ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంఘాలు మద్దతుగా నిలిచాయి. ‘రీట్స్‌పై సెబీ రూపొందించిన విధానం, కొంతమందికి ప్రయోజనం చేకూర్చడమే కోసమే’ అంటూ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దేశీయ, అంతర్జాతీయ మదుపర్లతో పాటు చిన్న మదుపర్ల ప్రయోజనాలకు అత్యంత భద్రత చేకూర్చేలా వివిధ వర్గాల సూచనలతో సెబీ, సెబీ నాయకత్వం కఠిన నియంత్రణా విధానాలను రూపొందించాయని ప్రశంసించింది. బచ్‌కు అండగా నిలుస్తున్నామని ద ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ కేపిటల్ అసోసియేషన్ తెలిపింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి తమ స్పందన తెలియజేశారని, అంతకుమించి తాము చెప్పేది ఏమీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు.
అదానీ గ్రూపుపై దర్యాప్తు విషయంలో సెబీ ఛైర్‌పర్సన్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అవరోధంగా నిలుస్తున్నాయంటూ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మాజీ బ్యూరోక్రాట్ ఇ.ఎ.ఎస్.శర్మ లేఖ రాశారు. ‘సెబీ ఛైర్‌పర్సన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. సెబీ కాకుండా ప్రభుత్వం, దాని సంస్థలతో సంబంధం లేని ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించి, ఆ ఆరోపణల్లో నిజానిజాలను వెలుగులోకి తేవాలి’ అని ఆయన తెలిపారు.