ఇజ్రాయల్ ఇరాన్ మధ్యలో నలిగిపోతున్న గల్ఫ్ దేశాలు…!
పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం మరింత ముదిరింది. ఓవైపు ఇరాన్ క్షిపణీదాడులకు సరైన సమాధానమివ్వాలని ఇజ్రాయెల్ తహతహలాడుతోంది. ఎలానూ అమెరికా అండ ఉండడంతో.. దాడులకు సిద్ధమవుతున్న సూచనలున్నాయి. అయితే దీనికి ఇరాన్ సైతం.. తనదైన ప్లానింగ్ తో ఉంది. తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల సహకారం లేకుంటే.. ఇజ్రాయెల్ తనపై ఆధిపత్యం సాధించలేదన్నది ఇరాన్ భావన. దీంతో ఆయా దేశాలకు అప్పుడే వార్నింగ్ జారీ చేసింది . ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ..ఇజ్రాయెల్ కు సాయం చేస్తే… దాన్ని తమపై దాడిగా పరిగణిస్తామని గట్టిహెచ్చరికలు పంపింది. సాయం చేసే ముందు .. తర్వాత జరిగే పరిణామాలు తెలుసుకోవాలని హెచ్చరించింది.
ఆయా దేశాలపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇన్నాళ్లు హెజ్ బొల్లా, హమాస్ ఉగ్రసంస్థలకు పరోక్షంగా సాయం చేసిన ఇరాన్.. ఇప్పుడు నేరుగా యుద్ధరంగంలోకి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఐఓసీ దేశాలు ఇప్పటివరకూ తాము ఇజ్రాయెల్ , ఇరాన్ కు మద్దతుగా ఉంటామని ప్రకటించలేదు. తాము తటస్థంగా ఉంటామని తేల్చి చెప్పాయి. ఎందుకంటే.. పొరపాటున తాము యుద్ధరంగంలోకి దిగితే వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆదేశాలకు తెలుసు. ఇరాన్ తమ గల్ఫ్ క్షేత్రాలను టార్గెట్ చేస్తే.. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోక తప్పదు. అందుకే.. తాము ఈ యుద్ధానికి దూరంగా ఉంటున్నామని చెబుతున్నాయి ఆదేశాలు.
అయితే.. . అమెరికా ఒత్తిడికి తలొగ్గి, ఇజ్రాయెల్ కు సహాయం చేస్తాయా అన్న భయం ఇరాన్ లోనూ ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. ఇరాన్ ను కట్టడి చేసేందుకు అమెరికా ఆంక్షల కత్తి ఝలిపించింది. ఇరాన్ కు నిధులు వచ్చే మార్గాలను కట్టడి చేసేందుకు గానూ.. ఆదేశానికి ఆయువుపట్టులాంటి పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులపై ఆంక్షలు విధించింది.16 సంస్థలు, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించింది. నేషనల్ ఇరాన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా..పెట్రోలియం,పెట్రోకెమికల్స్ రవాణా చేస్తున్నట్లు ఆరోపించింది.






