Joe Biden: జో బైడెన్ కు ప్రొస్టేట్ క్యాన్సర్…!

అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇటీవల బైడెన్‌కు ఆ వ్యాధి సంబంధించిన లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం బైడెన్ వైద్య బృందం… హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సా మార్గాలను పరిశీలిస్తోంది. హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్‌కి చికిత్సలు సాధారణంగా సమర్థవంతంగా ఉంటాయి. అయితే, మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు పూర్తిగా కోలుకునే చికిత్సలు లేవు, కానీ సరైన నిర్వహణతో రోగులు అనేక సంవత్సరాల పాటు జీవించవచ్చు. గత వారం కూడా, బైడెన్ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. అతని మూత్ర సమస్యలు తీవ్రమైన తర్వాత, అతని ప్రోస్టేట్ నాడ్యూల్‌ను తిరిగి పరీక్షించగా, ఆ వ్యాధి అతని ఎముకలకు వ్యాపించిందని తేలింది. బైడెన్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ వ్యాధి మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది హార్మోన్ సెన్సిటివ్ అని చెబుతున్నారు.
బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. ‘జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ సైతం స్పందిస్తూ బైడెన్‌కు క్యాన్సర్ అనే విషయం తనను కలచి వేసిందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని పేర్కొన్న ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.