Sailajanath: వైసీపీ గూటికి శైలజానాథ్..!? శింగనమలలో మారనున్న ఈక్వేషన్స్..!!

ఆంధ్రప్రదేశ్ (AP) లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓ వెలుగు వెలిగింది. టీడీపీ (TD) ఆవిర్భావం వరకూ ఆ పార్టీకి తిరుగులేదు. ఆ తర్వాత కూడా అటు అధికారంలోనో, ఇటు ప్రతిపక్షంలోనో ఆ పార్టీ కొనసాగుతూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీకి ఇక మనుగడ లేదని భావించిన నేతలు ఎంతోమంది ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అలా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్లలో సాకే శైలజానాథ్ (Sake Sailajanath) ఒకరు. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడి (PCC Chief) వరకూ పనిచేసిన ఆయన ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలందుతున్నాయి.
సాకే శైలజానాథ్ అనంతపురం (Anantapuramu) జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. శింగనమల (Singanamala) నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) , రోశయ్య (Rosaiah), కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) మంత్రివర్గాల్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గట్టిగా ఫైట్ చేశారు. అయితే ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది. అయినా శైలజానాథ్ మాత్రం అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆపత్కాలంలో ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు కూడా చేపట్టి ముందుకు నడిపించారు.
రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల (YS Sharmila) పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాత పార్టీకి మంచిరోజులు వస్తాయనుకున్నారు. అయితే ఆమె ఒంటెద్దు పోకడలతో పార్టీకి మరింత నష్టం కలిగిస్తోందని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదని శైలజానాథ్ లాంటి సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం, షర్మిల ఒంటెద్దు పోకడలను భరించే పరిస్థితి లేనందు వల్ల పార్టీ మారితే బాగుటుందని శైలజానాథ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
వాస్తవానికి శైలజానాథ్ టీడీపీలో (TDP) చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఒకానొకదశలో ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా అనుకున్నారు. అయితే చివరి నిమిషయంలో వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు టీడీపీలోకి వెళ్లే దారులు మూసుకుపోయాయి. అందుకే వైసీపీలో (YSRCP) చేరాలని శైలజానాథ్ నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వైసీపీ అధినేత జగన్ (YS Jagan) కూడా శింగనమల నియోజకవర్గ నేతలకు ఈ మేరకు సంకేతాలిచ్చారని తెలుస్తోంది. ఇంతకాలం అక్కడ నేతగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavathi) ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఆమె భర్త ఇతరత్రా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అందుకే శైలజానాథ్ ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా అక్కడ బలపడొచ్చని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో శైలజానాథ్ వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.