Trumb Vs Musk : ట్రంప్ – మస్క్ డిష్యుం డిష్యుం..! టెస్లా షేర్లు ఢమాల్..!!

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య గొడవలు తార స్థాయికి చేరాయి. వీళ్లిద్దరి జోడీ ఇటీవలి అమెరికా రాజకీయాల్లో (America Politics) ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. అయితే వాళ్ల మధ్య విభేదాలు రావడంతో ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన వన్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ (One Beautiful Bill Act) అనే ఆర్థిక బిల్లుపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేయడం ట్రంప్ కు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ బిల్లు ట్రంప్ ఆర్థిక, పన్ను విధానాలను కొనసాగించడానికి ఉద్దేశించింది. కానీ మస్క్ దీనిని తన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) ప్రయత్నాలకు విరుద్ధంగా భావించాడు. DOGE అనేది ప్రభుత్వ వ్యయాలను తగ్గించి, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ట్రంప్ ఏర్పాటు చేసిన ఒక టీమ్. దీనికి మస్క్ నాయకత్వం వహిస్తున్నాడు.
మస్క్, ట్రంప్ మధ్య సంబంధాలు మొదట బలంగా ఉన్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్‌కు గట్టి మద్దతు ఇచ్చాడు. ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌కు మద్దతు ఇవ్వడానికి సంతకం చేసిన వారికి రోజుకు మిలియన్ డాలర్లు ఇస్తానని ఒక బంపర్ ఆఫర్‌ను కూడా ప్రకటించాడు. ఈ మద్దతు ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ట్రంప్ కూడా గెలవగానే మస్క్ కు DOGE బాధ్యతలు అప్పగించారు. అయితే, వాళ్ల మధ్య స్నేహం ఎంతోకాలం నిలవలేదు.
మే 29న మస్క్ తన DOGE పదవి నుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ట్రంప్ ప్రతిపాదించిన వన్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ పై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ఈ బిల్లు ప్రభుత్వ వ్యయాలను మరింత పెంచే అవకాశం ఉందని, ఇది వ్యయం తగ్గించే DOGE లక్ష్యాలకు విరుద్ధమని మస్క్ భావించాడు. అయినా ట్రంప్ వెనక్కు తగ్గకపోవడంతో మస్క్ తన రాజీనామా ప్రకటించారు.
ట్రంప్, మస్క్ మధ్య గొడవకు మరో కోణం కూడా ఉంది. మస్క్ కు చెందిన టెస్లా (Tesla) సహా ఇతర వ్యాపారాలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటాయి. ట్రంప్ టారిఫ్‌లు, వాణిజ్య విధానాలు, ముఖ్యంగా భారత్ వంటి దేశాలతో సంబంధాలు.. మస్క్ ను ఆందోళనకు గురిచేశాయి. భారత్‌లో ఐఫోన్‌ల తయారీపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు, ఇది టెస్లా భారత మార్కెట్ విస్తరణ ప్రణాళికలపై ప్రభావం చూపవచ్చని మస్క్ భావించాడు. ఈ వివాదం అమెరికా రాజకీయాల్లో, ముఖ్యంగా వాణిజ్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మస్క్ రాజీనామాతో.. DOGE భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ ఆర్థిక విధానాలపై ఈ గొడవ ప్రభావం చూపవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మస్క్ వ్యాపార ప్రయోజనాలు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయని మరికొందరు భావిస్తున్నారు.
తన వల్లే ట్రంప్ ఇటీవలి ఎన్నికల్లో గెలిచారని ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే మస్క్ లేకపోయినా తన గెలుపుకు ఢోకా లేదని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు.. టెస్లా సహా ఇతర మస్క్ వ్యాపారాలపై ట్యాక్స్ లకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు. అయితే మస్క్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. నాసాతో స్పేస్ ఎక్స్ (Space X) డీల్ ను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. దీంతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ట్రంప్, మస్క్ గొడవ మరింత ముదిరితే టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థల షేర్లపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తంగా.. ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు అమెరికా ఆర్థిక విధానాలు, టెస్లా వ్యాపారాలపైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.