Washington: అమెరికా ఉపరితలం ఇక శత్రుదుర్భేద్యమే.. గోల్డెన్ డోమ్ పహారా మరి..!

నలువైపులా శత్రుదేశాలు పొంచి ఉండి.. రాకెట్లను ప్రయోగిస్తున్నా ఇజ్రాయెల్ ఎందుకంత సురక్షితంగా ఉంది. కేవలం దాని దగ్గర ఉన్న ఐరన్ డోమ్ (Iron Dome) కారణంగా. మరి మొన్నటి సిందూర్ యుద్ధంలో భారత్ ను కాపాడింది సుదర్శన ఎస్-400. మరి వీటన్నింటికీ తాత లాంటి అద్భుతమైన ఓ రక్షణ వ్యవస్థను రూపొందిస్తోంది అమెరికా. అగ్రరాజ్యం కదా.. అందుకే ఐరన్ డోమ్ ను తలదన్నే అద్భుత రక్షణ వ్యవస్థను తయారు చేస్తోంది. అదే గోల్డెన్ డోమ్ (Golden Dome). పేరుకు తగ్గట్లుగానే ఇది అమెరికా ప్రజల రక్షణ విషయంలో గోల్డెన్ డోమ్..
మారుతున్న యుద్ధ తంత్రానికి అనుకూలంగా అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచానికి ప్రాణం పోస్తోంది. దీనిలోభాగంగా తొలిసారి అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ప్లాన్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు విలువ 175 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది.
భూమి.. అంతరిక్షం నుంచి పహారా..
గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలావరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా.. మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల నెట్‌వర్కే అత్యంత కీలకమైంది. వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా రోనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్‌వార్స్ వ్యవస్థను తలపిస్తోంది.
అమెరికా విశాలమైన దేశం కావడంతో.. అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే.. అంతరిక్షంలో ఇంటర్‌సెప్టర్లతో ఓ నెట్‌వర్క్‌నే సృష్టించాల్సి ఉంటుందని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫారెన్ పాలసీ ప్రోగ్రామ్ పరిశోధన విభాగం డైరెక్టర్ మిషెల్ ఓ హన్‌లోన్ అభిప్రాయపడ్డారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదని.. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు ఇతర సామగ్రిని పెద్ద మొత్తంలో రోదసీలోకి చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇది చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి తీవ్రస్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని.. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి.
అత్యంత ఖరీదైన వ్యవహారం..
గోల్డెన్ డోమ్‌కు ప్రస్తుతం 25 బిలియన్ డాలర్లు కేటాయించారు. దీని మొత్తం నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ట్రంప్ చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ మాత్రం దీనిలోని సంక్లిష్టతల కారణంగా 500 బిలియన్ డాలర్లు అవుతుందని అంచనా వేసింది. దీనిని వచ్చే మూడేళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్(Trump) సూచించారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు కెనడా ఆసక్తిని వ్యక్తంచేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు.