Trump: బంధీలను విడిచిపెట్టకపోతే అంతే.. హమాస్ కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్…
Washington: ఇజ్రాయెల్-హమాస్ పోరుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ తన చెరలో బందీలను విడిచిపెట్టాలని హెచ్చరించారు. తాను ప్రమాణం చేసే సమయానికి వారిని విడిచిపెట్టకపోతే పశ్చిమాసియాలో ప్రళయం తప్పదని స్పష్టంచేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈ నెల 20న ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. హమాస్(Hamas) చెరలో ఉన్న బందీల గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఆ బందీలు నేను బాధ్యతలు స్వీకరించే సమయానికి వెనక్కి రాకపోతే.. పశ్చిమాసియా రగలడం ఖాయమన్నారు.
దోహాలో(Doha) జరుగుతున్న చర్చలు దాదాపు ఆఖరిదశలో ఉన్నాయి. ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందన్న చర్చలోకి నేను పోదలచుకోలేదు. చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. నేను ప్రమాణస్వీకారం చేసేసరికి శుభవార్త వింటామన్న ఆశ ఉంది’’ అని ట్రంప్ తెలిపారు. హమాస్ చెరలో దాదాపు 100 మంది బందీలు ఉన్నారు. ప్రస్తుతం.. ఖతార్ రాజధాని దోహాలో గాజా కాల్పుల విరమణ, బందీల విడుదలపై హమాస్-ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటికి అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.
‘‘బందీలను విడిచిపెట్టకపోతే హమాస్కే కాదు.. ఎవరికీ మేలు జరగదు. విధ్వంసం ఖాయం. ఇంతకుమించి చెప్పదలచుకోలేదు. అసలు ఎప్పుడో బందీలను హమాస్ విడిచిపెట్టి ఉండాల్సింది. అసలు వారిని చెరలోకి తీసుకోకుండానే ఉండాల్సింది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన వెలువడిన సమయంలోనే గాజాలో ఓ బందీ మృతదేహం దొరికినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇది యోసఫ్ అల్ జేదానీదిగా గుర్తించారు. 2023 అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు జేదానీతో పాటు.. అతని కొడుకును కూడా అపహరించారు. గాజాలో ఇంకో మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని.. అది బందీదా కాదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని సైన్యం పేర్కొంది.






