ట్రంప్ టైమ్ ఆగయా..?
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పలు ప్రైమరీల్లో విజయం సాధించిన ట్రంప్.. ఇప్పుడు లేటెస్టుగా దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. సొంత రాష్ట్రంలోనూ నిక్కీ హేలీకి ఓటమి తప్పలేదు. ట్రంప్ హవా కొనసాగుతున్న రాష్ట్రాల్లో న్యూ హాంప్‌షైర్, నెవడా, ఐయోవా, వర్జిన్ ఐలాండ్స్ తర్వాత సౌత్ కరోలినా వచ్చి చేరింది. ఇన్ని ఓటములు ఎదురైనప్పటికీ … ఇప్పటికీ హేలీ పోటీ నుంచి వైదొలగడానికి అంగీకరించడం లేదు. మార్చి 5న పలు రాష్ట్రాల్లో జరిగే ప్రైమరీల్లోనూ తాను రేసులో ఉంటానని ప్రకటించారు.
అంతేకాదు.. తాను ట్రంప్‌కు ప్రత్యర్థిగానే ఉంటానన్నారు నిక్కీ. ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్, ట్రంప్ మధ్య మరోసారి హోరాహోరీ పోటీ తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఇప్పుడున్నంత ఐక్యంగా మునుపెన్నడూ లేదన్నారు ట్రంప్. తాజా ఆధిక్యం తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. చాలా కాలం నుంచి దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టుంది. గతంలో నిక్కీ హేలీ ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు.
అయినప్పటికీ.. తాజా ప్రైమరీలో ఆమెకు మద్దతు కరవైంది. గవర్నర్‌గా ఆమె చాలా మంచి పనులు చేసినప్పటికీ.. జాతీయ స్థాయి వ్యవహారాలను మాత్రం ఆమె ట్రంప్ కంటే మెరుగ్గా నిర్వహించలేరని భావిస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే….రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి నామినేషన్ కోసం బరిలో ఉన్న నిక్కీ హేలీ జనవరి నెలలో డొనాల్డ్ ట్రంప్ కన్నా ఎక్కువ విరాళాలు పొందగలిగారు. హేలీకి 1.15 కోట్ల డాలర్ల విరాళాలు లభించగా ట్రంప్ 88 లక్షల డాలర్లు మాత్రమే పొందగలిగారు. ఇంతవరకు ఆయన ఎన్నికల వ్యయం 1.15 కోట్ల డాలర్లు. అంటే, తనకు అందిన విరాళాల కన్నా ఎక్కువ ఖర్చయింది.






