Trump – Modi: ట్రంప్ నోటి దూల..! మోదీకి తలనొప్పి ..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత్-పాకిస్తాన్ (India – Pakistan) మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని, వాణిజ్య ఒప్పందాలను బూచిగా చూపి యుద్ధాన్ని నివారించానని ట్రంప్ చేసిన ప్రకటనలు భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయి. అంతేకాదు.. భారత్ సుంకాలు లేని వాణిజ్యానికి అంగీకరించిందని, ఆపిల్ కంపెనీ భారత్‌లో ఫోన్ల తయారీని ఆపి అమెరికాకు తరలించాలని ట్రంప్ హెచ్చరించడం ద్వైపాక్షిక సంబంధాలపై కొత్త సవాళ్లను లేవనెత్తింది. ఈ పరిణామాలు భారత్‌లో రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి.
మే 10న ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ (Truth) సోషల్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు భారత విదేశాంగ విధానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం.. భారత్-పాకిస్తాన్ సమస్యలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి, మూడో పక్ష జోక్యాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలు ఈ ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శకులు పేర్కొన్నారు. భారత్ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చినప్పటికీ.. ట్రంప్ తన మధ్యవర్తిత్వంతోనే కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమని పేర్కొనడం మరింత వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ ఈ ప్రకటనను స్వాగతించగా.. భారత్‌లో ప్రతిపక్ష నాయకులు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తృతీయ పక్ష మధ్యవర్తిత్వానికి భారత్ తలుపులు తెరిచిందా? అని ప్రశ్నించారు.
ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ జోక్యంతో ఆగలేదు. వాణిజ్యం విషయంలోనూ భారత్‌పై ఒత్తిడి పెంచారు. భారత్ అమెరికా వస్తువులపై 52% సుంకాలు విధిస్తోందని, అందుకు ప్రతీకారంగా అమెరికా 26% సుంకాలు విధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, భారత్ సుంకాలు లేని వాణిజ్యానికి అంగీకరించిందని ప్రకటించారు. దీన్ని భారత్ తక్షణం ఖండించింది. మరోవైపు.. భారత్‌లో ఐఫోన్ తయారీని విస్తరించాలన్న ఆపిల్ (Apple) ప్రణాళికలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడి, భారత్‌లో కాకుండా అమెరికాలోనే ఫోన్లు తయారు చేయాలని ఆదేశించారు. ఫాక్స్ కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు భారత్‌లో ఐఫోన్ల అసెంబ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ హెచ్చరిక భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ట్రంప్ పదేపదే మోదీని తన “మంచి స్నేహితుడు”గా అభివర్ణిస్తుంటారు. కానీ ఆయన చర్యలు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్-అమెరికా వాణిజ్య లోటు 40 లక్షల కోట్లకు చేరిన నేపథ్యంలో, ట్రంప్ సుంకాల తగ్గింపు, అమెరికా చమురు కొనుగోళ్లపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, భారత్ ఇప్పటికే లగ్జరీ కార్లపై సుంకాలను 125% నుంచి 70%కి తగ్గించడం, అమెరికా ఔషధ దిగుమతులపై సున్నా సుంకం సిఫారసు చేయడం వంటి చర్యలు చేపట్టింది.
ట్రంప్ వ్యాఖ్యలు, చర్యలు భారత్-అమెరికా సంబంధాలు కొత్త సవాళ్లు రేకిత్తిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ట్రంప్ “స్నేహం” మాటల వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ ఒత్తిడులను భారత్ ఎలా నిర్వహిస్తుందన్నది వేచి చూడాలి.