Trump-Musk: ట్రంప్ కు మస్క్ సారీ.. చిగురించిన స్నేహబంధం..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు సమసిపోయినట్లేనా.. ? స్వయంగా ఫోన్ చేసి మస్క్ క్షమాపణలు కోరడంతో.. ఈ ఎపిసోడ్ కు తెరపడిందా..? మస్క్ క్షమాపణలను ట్రంప్ స్వాగతించారా…? ప్రస్తుత పరిణామాలను చూస్తే అదే అనిపిస్తోంది. ఈ వివాదాన్ని సాగదీయకూడదని ఇరువురు భావించడంతో.. ఈపరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్… టెస్లా అధినేత మస్క్.. ఈ ఇద్దరి మధ్య స్నేహబంధం చిగురించినట్లే కన్పిస్తోంది. అధ్యక్షుడిపై తాను చేసిన తీవ్ర ఆరోపణలపై మస్క్ (Elon Musk) పశ్చాత్తాపం చెందారు. దీనిపై అధ్యక్షుడికి ప్రైవేటుగా ఫోన్ చేసిన ఆయన.. ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తంచేశారు. అటు ట్రంప్ (Donald Trump) కూడా టెస్లా అధినేతను క్షమించారు. ఈ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ వెల్లడించారు. ఈ పరిణామాలపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన నా పోస్టులపై చింతిస్తున్నా. అవి చాలా దూరం వెళ్లాయి’ అని విచారం వ్యక్తం చేశారు. అయితే, దీనికంటే ముందు సోమవారం అర్ధరాత్రి అధ్యక్షుడికి మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ ఆరోపణలకు గానూ ట్రంప్‌నకు ఆయన సారీ చెప్పినట్లు పేర్కొన్నాయి. గత శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సూసీ విల్స్‌తో మస్క్ ఫోన్‌లో సంభాషించారు. ట్రంప్‌తో విభేదాలు పరిష్కరించుకోవాలని టెస్లా అధినేతకు వారు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పందించారు. ‘‘ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారు. దీన్ని ఆయన అభినందించారు. అమెరికా ప్రజల ప్రయోజనాలపై మా దృష్టి కొనసాగుతోంది’’ అని ఆమె తెలిపారు. ఇక, ట్రంప్ చెప్పినట్లు మస్క్‌కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా?అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు.
అమెరికా ప్రభుత్వం రూపొందించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ట్రంప్‌నకు, ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈక్రమంలో ట్రంప్‌పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన మద్దతు లేకపోయి ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ వెనక్కి తగ్గుతూ నిన్న పోస్ట్ చేశారు.