దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు..! దటీజ్ చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఎవరూ ఊహించని ఫలితాలవి. ఏమాత్రం అంచనాలకు అందలేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఏమాత్రం జీర్ణించుకోలేని నెంబర్స్ ఇవి. కూటమి పార్టీలు కూడా గెలుస్తాం అనే ధీమాతో ఉన్నాయి కానీ ఈ స్థాయిలో విజయం దక్కుతుందని మాత్రం కలగనలేదు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు గురించే.! ఆయన రాజకీయ అనుభవం, ఎప్పటికప్పుడు తను తీసుకున్న నిర్ణయాలు ఈరోజు టీడీపీని మరోసారి విజయతీరాలకు చేర్చాయి. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతున్నాయి.
చంద్రబాబు అపర చాణక్యుడిగా పేరొందారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆ పార్టీని గట్టెక్కించారు. తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన వ్యూహాలతో చక్రం తిప్పారు. నేషనల్ ఫ్రంట్ హయాంలో చంద్రబాబు హవా ఓ రేంజ్ లో ఉండేది. వాజ్ పేయి ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్రధారి. అయితే 2019 తర్వాత చంద్రబాబు హవా తగ్గుతూ వచ్చింది. దారుణంగా పరాభవం చెందింది టీడీపీ. ఈ ఓటమి టీడీపీ శ్రేణులను నివ్వెరపరిచింది. అయినా పట్టువదలకుండా పోరాడారు. ఎన్నో కేసులు, అవమానాలు ఎదురైనా ఎదురొడ్డి నిలిచారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీని మరోసారి అక్కున చేర్చుకున్నారు.
ఏపీలో టీడీపీకి గెలుపు అనివార్యం. పార్టీని బతికించుకోవాల్సింటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. వైసీపీ అణచివేత టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు చంద్రబాబుకు వయసు మీద పడుతోంది. లోకేశ్ వ్యూహాలు 2019లో బెడిసి కొట్టాయి. ఈ దఫా కూడా ఓడిపోతే పార్టీ మనుగడ కష్టం. అందుకే చావోరేవో అన్నట్టు తలపడింది టీడీపీ. జనసేనను కలుపుకుపోయింది. తద్వారా బీజేపీని కూడా లాగగలిగింది. మూకుమ్మడిగా జరిపిన పోరులో కూటమి ఘనవిజయం సాధించింది. ఈ స్థాయిలో విజయాన్ని దేశం కూడా ఊహించలేదు. కూటమి పార్టీల్లో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు దక్కించుకున్నది టీడీపీయే. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు మరోసారి చక్రం తిప్పబోతున్నారు.
ఎన్డీయే కూటమిలో గతంలో లాగా ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. తప్పుకండా ఇతర పార్టీలపైన ఆధారాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులోనూ 16 సీట్లు సాధించిన టీడీపీపైనే ఎక్కువ ఆధారపడాల్సి ఉంది. ఎంతలా ఉంటే చంద్రబాబు లేకుండా మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని దుస్థితి. టీడీపీని ఇండియా కూటమి లాక్కెళ్తుందేమోనని భయం వెంటాడుతోంది. అందుకే ఉదయం ఊగిసలాడిన మార్కెట్లు చంద్రబాబు తాము ఎన్డీయేలోనే ఉంటామని ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా ఆకాశానికి దూసుకెళ్లాయి. దటీజ్ చంద్రబాబు. ఈ ఐదేళ్లు చంద్రబాబు మరోసారి తానేంటో నిరూపించుకునే టైమ్ వచ్చింది.