అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ .. ఎన్నికలే టార్గెట్ గా ట్రూడో సర్కార్ అడుగులు..
కెనడా ఎటు పయనిస్తోంది. యువత అవకాశాల స్వర్గంగా భాసిల్లిన ఆ కెనడా.. ఇప్పుడు ఎందుకిలా అవుతోంది. ట్రూడో సర్కార్ చెప్పిందేంటి..? చేస్తుందేంటి..? ఓట్లకోసం ఖలిస్తానీ వేర్పాటు వాదుల ముందు మరీ అంతలా సాగిలపడాల్సిన పరిస్థితులున్నాయా…? వారికోసం, ముఖ్యంగా వారిఓట్లకోసం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ తో కోరి కయ్యానికి కాలుదువ్వడం ఎంతవరకూ సమంజసం..ప్రస్తుతం ఈ ప్రశ్నలు భారతీయులను తీవ్రంగా వేధిస్తున్నాయి.
భారత్-కెనడా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గతంలో నిజ్జర్ హత్యకేసులో భారత్ పై ఆరోపణలు చేసిన ట్రూడో సర్కార్.. ఇప్పుడు ఏకంగా భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను.. అనుమానితుల లిస్టులో చేర్చింది. దీనికి సంబంధించి సమాచారం రావడంతో .. భారత్ తీవ్రంగా స్పందించింది. నిజ్జర్ హత్యకేసులో భారత హైకమిషనర్ సంజయ్ వర్మను.. అనుమానితుల లిస్టులో చేర్చింది కెనడా. 2023లో నిరాధార ఆరోపణలు చేసిన కెనడా ప్రభుత్వం.. దానికి సంబందించిన ఎలాంటి ఆధారాలను తమతో పంచుకోలేదని భారత విదేశాంగశాఖ ఆరోపించింది.
ఇప్పటికే పలుమార్లు తాము అభ్యర్థించామని.. అయితే, తమకు కెనడా సర్కార్ సహకరించలేదంది. కేవలం ఓట్ల లబ్ధికోసమే.. కెనడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని మండిపడింది.అంతేకాదు… 2018 నుంచే ట్రూడో సర్కార్.. భారత్ తో ఘర్షణాత్మక వైఖరి అవలంభించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. భారత్ లో వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని మంత్రివర్గంలో చేర్చుకోవడాన్ని.. దీనికి నిదర్శనంగా చూపించింది.
అంతేకాదు.. 2020లో భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ట్రూడో సర్కార్ ప్రయత్నించిందని ఆరోపించింది. ఆసియాన్ సదస్సు సందర్భంగా సైతం ఇద్దరు నేతల మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని భారత్ స్పష్టం చేసింది.సదస్సు సమయంలో వారిద్దరు ఎదురుపడ్డారని క్లారిటీ ఇచ్చింది. భారత వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, వేర్పాటువాదులపై చర్యలు తీసుకునేంతవరకూ… ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం జరిగే పనికాదంటున్నారు దౌత్యనిపుణులు.






