సెక్యులర్ నుంచి ఇస్లామిక్ కంట్రీగా మారుతున్న బంగ్లాదేశ్…?
పొరుగు దేశం బంగ్లాదేశ్ క్రమంగా మతశక్తుల చేతుల్లోకి జారిపోతోందా..? షేక్ హసీనా వైదొలగిన తర్వాత.. మతశక్తులు బలోపేతమైనట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో హిందువుల మీద ఏకంగా 2 వేల దాడులు జరిగినట్లు సమాచారం. ఈదశలో తమను కాపాడాలని, దాడులు జరగకుండా చూడాలంటూ వేలాది మంది మైనార్టీ హిందువులు .. ఆందోళనకు దిగారు. పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు కూడా. దీంతో అక్కడి ఆపద్దర్మ ప్రభుత్వంలో మార్పు వస్తుందని అందరూ భావించారు. అయితే పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నందున.. సెక్యులర్ పదాన్ని తొలగించడంతో సహా రాజ్యాంగంలో గణనీయమైన మార్పుల తీసుకురాలని అన్నారాయన. ఈ మేరకు రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా ఏజీ హోదాలో తన వాదనలను వినిపించారు. న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరిలు 15వ సవరణ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టారు.
ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తూ.. ‘‘సవరణలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలి. కానీ నిరంకుశత్వానికి కాదు. ఆర్టికల్ 2Aలో దేశంలో అన్ని మతాల ఆచరణలో సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం’ గురించి చెబుతుంది. ఇది విరుద్ధమైంది. దేశ విభజనలో షేక్ ముజిబుర్ రెహమాన్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. అయితే.. సెక్యులర్ అనే పదాన్ని చట్టం ద్వారా అమలు చేయడం విభజనను సృష్టిస్తుంది. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలి.
15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలి’ అని వాదనలు వినిపించారు. ఏజీ వాదనలు చూస్తుంటే.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశం అవగతమవుతోందంటున్నారు అక్కడి హిందువులు. తమను కాపాడాలని కోరుతుంటే.. ఉన్న రక్షణల్ని తీసేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈతరుణంలో అమెరికా, ఇంగ్లండ్, భారత్ లాంటి దేశాలు.. ఈపరిణామాల్ని ఎలా చూస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.






