YSR – KCR: సంక్షోభంలో వైఎస్ఆర్, కేసీఆర్ కుటుంబాలు..! ఆడపడుచులే దోషులా..!?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ (YSR), కేసీఆర్ (KCR) కుటుంబాలకు ప్రత్యేక చరిత్ర ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆ కుటుంబాల సొంతం. తండ్రులు, ఆ తర్వాత వారసులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో తమ పట్టు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ కుటుంబాల ఆడపడుచులే ఈ సంక్షోభాలకు కారణం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha) ఇప్పుడు సొంత పార్టీపైనా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. మరోవైపు వైసీపీ (YCP) అధినేత జగన్ (YS Jagan) పై ఇప్పటికే షర్మిల రాజకీయ యుద్ధం చేస్తున్నారు.
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, అతని సోదరి వై.ఎస్.షర్మిల (YS Sharmila) మధ్య 2021లో విభేదాలు మొదలయ్యాయి. దీంతో.. షర్మిల ఏపీని వదిలేసి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు. ఆస్తి పంపకాల్లో విభేదాలే ఇందుకు కారణం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని షేర్లను షర్మిలకు బదిలీ చేయాలని ఆమె పట్టుబడుతున్నారు. ఇందుకు జగన్ ప్రేమ, ఆప్యాయతలతో అంగీకరించినప్పటికీ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. తనకు ఇప్పుడు చెల్లిపై ప్రేమ, అనురాగాలు లేవని, తాను తల్లి ద్వారా బదలాయించిన షేర్లను నిలిపేయాలని NCLTని ఆశ్రయించారు. తమ తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఆస్తిని నలుగురు మనవళ్ల మధ్య సమానంగా పంచాలని షర్మిల కోరుతున్నారు. షర్మిలకు తల్లి విజయమ్మ (YS Vijayamma) అండగా నిలిచారు. దీంతో వైఎస్ కుటుంబం అంతర్గత కలహాలతో వార్తల్లో నిలుస్తోంది. అన్న జగన్ పై పగబట్టిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్ గా జగన్ పైనే రాజకీయ యుద్ధం చేస్తున్నారు.
మరోవైపు.. తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా సోదరుడు కేటీఆర్ పై కవిత అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఆమె అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె పరోక్షంగా పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్ దేవుడు అంటూనే.. పార్టీని నడపడంలో ఆయన చేతగానితనాన్ని కవిత ఎత్తి చూపుతున్నారు. ఇది ఆ పార్టీలో, కుటుంబంలో అంతర్గత సంక్షోభాన్ని బట్టబయలు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్టు బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ. ఆ సమయంలో సోదరుడు కేటీఆర్ స్పందన సరిగా లేదనే ఫీలింగులో కవిత ఉన్నారు. అప్పటి నుంచే వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కేటీఆర్ ఆధిపత్యాన్ని కేసీఆర్ కూడా సరిగా డీల్ చేయలేకపోతున్నారనే ఆవేదన కవితలో కనిపిస్తోంది.
ఇటీవలి ఎన్నికల్లో ఓటమి చెందడం, మరోవైపు కుటుంబ విభేదాలు అటు వైఎస్ఆర్‌సీపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు పెద్ద సమస్యగా మారాయి. ఈ ఓటములు రెండు పార్టీల్లోనూ అంతర్గత సంక్షోభాన్ని తెచ్చాయి. జగన్‌ను విడిచిపెట్టి పలువురు నాయకులు ఇతర పార్టీల్లో చేరడం, బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేల కాంగ్రెస్ గూటికి వెళ్లడంతో ఆ పార్టీలు బలహీనపడ్డాయి. ఇదిలా ఉండగానే అటు షర్మిల, ఇటు కవిత రూపంలో ఇరు కుటుంబాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరి చెల్లెళ్ల పోరు నుంచి అన్నలు ఎలా బయటపడతారనేది వేచి చూడాలి.