YCP: ఏపీ ఇమేజ్‌ని వైసీపీ డ్యామేజ్ చేస్తోందా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణ, బాండ్ల జారీల చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) ద్వారా రూ. 9,000 కోట్ల విలువైన నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCD) బాండ్లను జారీ చేసి నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఈ బాండ్ల జారీపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బాండ్ల జారీ రాజ్యాంగ విరుద్ధమని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఈ బాండ్లు కొనొద్దంటూ వైసీపీకి (YCP) చెందిన కొంతమంది సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) లాంటి 2వందలకు పైగా సంస్థలకు అజ్ఞాత లేఖలు రాశారు. వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇలాంటి వాళ్లపై దేశద్రోహం కేసులు పెట్టాలన్నారు.
ఏపీఎండీసీ ద్వారా జారీ చేసిన బాండ్లపై రాష్ట్ర ఖజానాకు భారీ ఆర్థిక భారం పడుతుందని వైసీపీ అధినేత జగన్ వాదిస్తున్నారు. ఈ బాండ్లు 9.3% వడ్డీ రేటుతో జారీ చేశారని, ఇది సాధారణ స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ (SDL) రేటు కంటే 2.6% ఎక్కువని చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత దిగజారుతుందని జగన్ ఆరోపించారు. అంతేకాక ఈ బాండ్ల జారీ విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. దీనిపై ఏపీ హైకోర్టులో కేసు ఉండగానే ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) ఆరోపించారు. ఈ బాండ్ల జారీ వెనుక ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పించారని విమర్శించారు.
వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ఈ బాండ్ల జారీకి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. అది విచారణలో ఉంది. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి ద్వారా ఈ బాండ్ల జారీని అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక, సెబీ, ఆర్‌బీఐలకు దొంగ లేఖలు రాసి, రాష్ట్ర ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ముసుగువేసుకున్న కొంతమంది వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా పలు సంస్థలకు లేఖలు రాశారు. అమరావతికి నిధులు ఇవ్వొద్దంటూ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ లాంటి వాటికి లేఖలు రాశారు.
ఆసక్తికర విషయమేంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే బాండ్ల ద్వారా నిధుల సమీకరణ మొదలైంది. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ. 18,500 కోట్ల రుణాలు తీసుకున్నారు. స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తు ఆదాయాన్ని చూపించి మరీ అప్పులు తీసుకున్నారు. దీనిపై అప్పట్లోనే కేంద్ర ఆర్థిక శాఖ లేఖ అభ్యంతరం తెలిపింది. భవిష్యత్తు ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని అప్పులు తీసుకోవడం సరికాదని సూచించింది. అంతేకాదు.. జగన్ ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా నిధుల సమీకరణకు జీవో విడుదల చేసింది. అయితే అది సాకారం కాలేదు. ఇప్పుడు ఇదే ఏపీఎండీసీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బాండ్లు జారీ చేస్తుంటే వైసీపీ హడావుడి చేస్తోంది. అందుకే రాష్ట్ర ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు చేసి లేఖలు రాస్తున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలని పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.