Smita Sabharwal : వాళ్లందరికీ నోటీసులు ఇస్తారా..? తగ్గేదే లేదంటున్న స్మితా సభర్వాల్..!!

హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) భూముల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంలో తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు (Smita Sabharwal) గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో (Social Media) ఆమె రీపోస్ట్ చేసిన ఒక నకిలీ ఫోటో (Fake AI Post) ఈ వివాదానికి కారణమైంది. ఈ ఘటన తెలంగాణ రాజకీయ, పరిపాలన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ పోస్టుపై స్మితా సభర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది వివాదాన్ని మరింత రాజేస్తోంది.
కంచె గచ్చిబౌలి భూములపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) సమీపంలోని ఈ భూముల్లో వన్యప్రాణులున్నట్టు సూచిస్తూ ఏఐ (AI) ద్వారా రూపొందించిన ఒక నకిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయగా, స్మితా సభర్వాల్ దాన్ని తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. ఈ పోటో నకిలీదని, దీన్ని సర్క్యులేట్ చేయడం తప్పని.. ఇది నేరమని భావించిన పోలీసులు BNS సెక్షన్ 179 కింద ఆమెకు ఏప్రిల్ 12న నోటీసులు జారీ చేశారు.
స్మితా సభర్వాల్ ఈ నోటీసులకు స్పందిస్తూ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ లో పెట్టారు. గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించానని, తన వివరణను సమర్పించానని పేర్కొన్నారు. అయితే, ఆమె పోస్ట్ లో ఒక కీలక ప్రశ్నను లేవనెత్తారు. తాను రీపోస్ట్ చేసిన ఫోటోను సుమారు 2000 మంది రీపోస్ట్ చేశారని, అందరికీ ఇలాంటి నోటీసులు జారీ చేస్తారా లేక కొందరిని మాత్రమే ఎంపిక చేసి చర్యలు తీసుకుంటారా అని సూచనప్రాయంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పోలీసు చర్యల నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారిగా ఉన్న స్మితా సభర్వాల్‌తో పాటు ఇతరులపై కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొందరు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. స్మితా సభర్వాల్ రీపోస్ట్ వివాదం ఆమె ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల చర్యలు, ఆమె ప్రశ్నలు ఈ వివాదాన్ని మరింత రాజకీయంగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.