Raja Singh : బీజేపీకి సవాలుగా మారుతున్న రాజా సింగ్..!

తెలంగాణలోని గోషామహల్ (Gosha Mahal) బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ (Raja Singh) తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha).. బీఆర్ఎస్‌ను బీజేపీలో (BJP) విలీనం చేయాలనే ప్రతిపాదన ఉందని చేసిన వ్యాఖ్యలను రాజా సింగ్ సమర్థించారు, కవిత చెప్పినది నిజమేనని అనుకుంటున్నా అన్నారు. మంచి ప్యాకేజీ దొరికితే మా నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని ఆయన అని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించడమే కాకుండా, పార్టీలోని అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేశాయి.
రాజా సింగ్ గతంలోనూ తన సంచలన వ్యాఖ్యలతో బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో కుమ్మక్కై రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. “గత ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. అందుకే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. దొంగలంతా ఒక్కటయ్యారు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానానికి చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజా సింగ్ బహిరంగంగా సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించడం ఇది మొదటిసారి కాదు.
రాజా సింగ్ గతంలో రామనవమి ఊరేగింపుల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఏప్రిల్ లో హైదరాబాద్‌లో జరిగిన రామనవమి శోభాయాత్ర సందర్భంగా, పోలీసులను బెదిరించినట్లు ఆరోపణలు రాగా, ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. “పోలీసులు కార్యకర్తలపై లాఠీలతో దాడి చేస్తే, నేనూ అదే లాఠీతో కొడతాను” అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదనంగా, ఊరేగింపుల్లో అనుమతించని వాహనాలు, హై-వాల్యూమ్ డీజే సిస్టమ్స్ ఉపయోగించారని ఆయనపై నమోదైన కేసులు పోలీసులతో ఆయన సంబంధాలను మరింత దిగజార్చాయి. ఇదే సమయంలో.. ఔరంగజేబు సమాధిని కూల్చాలని, వక్ఫ్ బోర్డు భూములపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. “భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని” పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కూడా రాజా సింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక ఆధారంగా, ఆయనకు సంబంధించిన రెండు ఫేస్‌బుక్ గ్రూపులు, మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా తొలగించింది. ఈ నివేదికలో రాజా సింగ్ 32 హేట్ స్పీచ్‌లు చేసినట్లు, వాటిలో 22 హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.
పార్టీ అధిష్టానంతో రాజా సింగ్ విభేదాలు కూడా బహిర్గతమయ్యాయి. ఈ ఏడాది మార్చిలో ఆయన బీజేపీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీలోని పాత బరువును తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం స్థాపించాలంటే, పార్టీ నాయకత్వంలో మార్పులు అవసరమని స్పష్టం చేశారు. తనను పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ లో జరిగిన కీలక బీజేపీ సమావేశానికి ఆయన గైర్హాజరవ్వడం, అంతర్గత విభేదాలను మరింత స్పష్టం చేసింది. రాజా సింగ్ వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఆయన హిందుత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ, మరోవైపు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ అధిష్టానంపై విమర్శలు బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా ఉండనుంది.