MLC Election: ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్..? బీజేపీకి షాక్ తప్పదా..?

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (Hyderabad MLC Election) ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 23న జరగనున్న ఈ ఎన్నికలో బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) మధ్య పోటీ ఏర్పడింది. బీఆర్ఎస్ (BRS) ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్ (Congress) పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దతివ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. వీటిలో ఎంఐఎంకు (AIMIM) 49 ఓట్లున్నాయి. 40మంది కార్పొరేటర్లు, 7గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఎంఐఎంకు ఉన్నారు. బీజేపీకి 27 ఓట్లు, బీఆర్ఎస్‌కు 23 ఓట్లు, కాంగ్రెస్‌కు 13 ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం తరపున మిర్జా రియాజ్ ఉల్ హసన్ (Mirza Riyaz Ul-Hasan) బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు గౌతమ్ రావును (Gowtham Rao) పోటీలో ఉన్నారు.
తమకు తగినంత మంది సభ్యులు లేకపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ ఓటు వేయకూడదని విప్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎంఐఎం, బీజేపీ రెండూ ఒక్కటేనని… మేము ఎవరికీ మద్దతివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి తగినంత మంది సభ్యులు కూడా లేరు. బీజేపీ ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌ను ఎంఐఎంకు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ కామెంట్స్ ను తిప్పికొడుతోంది. బీజేపీ,బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని, బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం ఈ ఒప్పందంలో భాగమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిచ్చిందని, ఇప్పుడు కూడా రహస్య ఒప్పందం ఉందని మరో మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆరోపించారు.
బీజేపీ ఈ ఎన్నికను దేశభక్తులు వర్సెస్ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఈ మూడు పార్టీలు బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉండటంతో వారికి గెలుపు అంత ఈజీ కాదు. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆత్మప్రభోదానుసారం ఓటేయాలని కోరుతోంది కమలం పార్టీ. ఎంఐఎంను సిటీ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిస్తోంది. ఎంఐఎం తమ సంఖ్యాబలంతో ఈ ఎన్నికలో సునాయాసంగా గెలుస్తామని భావిస్తోంది. కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తే వాళ్ల బలం 62కి చేరుతుంది. గెలుపుకు అవసరమైన 57 ఓట్ల కంటే ఇది ఎక్కువ. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పొచ్చు.